ధాన్యం దాచేసి..


సాక్షి, నెల్లూరు: అక్రమ వ్యాపారులు విజృంభించారు. అన్నదాతల నుంచి కారు చౌకగా ధాన్యం కొట్టేసి కోట్లాది బస్తాలు అక్రమంగా నిల్వ చేశారు. అంతేకాదు ధాన్యాన్ని కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి కొందరు జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించి ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచి బియ్యం అమ్మకాలు సాగించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.

 

 ఉన్నతాధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో కొందరు కిందిస్థాయి అధికారుల మద్దతుతో అక్రమ వ్యాపారులు తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. మంగళవారం బుచ్చిరెడ్డిపాళెం, బుధవారం పెనుబల్లిలో లక్ష బస్తాలకు పైగా ధాన్యం అక్రమ నిల్వలు బయట పడ్డాయి. మంగళవారం రాత్రి  పొదలకూరులో కోట్లాది రూపాయిల విలువైన 15 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం నిల్వలు విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ధాన్యం అక్రమ నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నట్టు స్పష్టమవుతోంది.

 

 ఆరుగాలం కష్టించి రైతులు పండించిన ధాన్యం దళారుల పాలైంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి తామే ధాన్యం కొంటామన్న ప్రభుత్వం పూర్తి  స్థాయిలో ఆ పని చేయకపోవడంతో అన్నదాతలు గిట్టుబాటు కాక పోయినా ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు, ప్రభుత్వ అనుమతులు లేని మిల్లర్లు కోట్లాది రూపాయిల విలువైన ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి కోవూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట, కావలి తదితర నియోజక వర్గాల్లో అక్రమంగా నిల్వ ఉంచారు. రైతులు పండించిన ధాన్యంలో దాదాపు సగం ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

 

 నిబంధనలకు విరుద్ధం

 ప్రైవేటు వ్యాపారులు ధాన్యాన్ని కొనడం, నిల్వ ఉంచడం నిబంధనలకు విరుద్ధం. అయితే అక్రమ వ్యాపారానికి కొందరు అధికారులు మామూళ్లు పుచ్చుకుంటూ సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే మరి కొందరు అధికారులు ధాన్యం కొనుగోళ్ల అక్రమ వ్యాపారంలో వాటాలు దక్కించుకుం టున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలు ఉండడంతో అక్రమ వ్యాపారాలు ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ధైర్యంగా నిల్వ ఉంచడంతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం.

 

 వేరే రాష్ట్రాలకు ధాన్యం తరలింపు

 జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వ్యాపారులు తమిళనాడు, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాలకు యథేచ్ఛగా ఎగుమతి చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో లారీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్టు సమాచారం. చెక్ పోస్టు తనిఖీ అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టచెప్పి ధాన్యాన్ని తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వ్యాపారులు నకిలీ పర్మిట్లతో కూడా ధాన్యం ఎగుమతి చేస్తున్నారని సమాచారం.

 

 కృత్రిమ కొరత సృష్టించి ధరల పెంపు

 అక్రమ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచి వినియోగదారులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంది.  

 

 పట్టించుకోని అధికారులు

 కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారులు ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. దీంతో వారు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే అదనుగా చూసుకున్న  అక్రమ వ్యాపారులు కొందరు కిందిస్థాయి అధికారులను మచ్చిక చేసుకుని ధాన్యం తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విజిలెన్స్ అధికారులు సైతం పూర్తి స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి లేదు. అడపాదడపా దాడులతో వారు సరి పెడుతున్నారన్న విమర్శలున్నాయి.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top