'తోడు' దొంగ!

'తోడు' దొంగ!


పట్టిసీమలో 11 మీటర్ల మట్టం వద్ద నీటిని తోడేలా డిజైన్

జీవోలో మాత్రం గోదావరిలో కనీస మట్టం

14 మీటర్లు ఉన్నప్పుడే తోడాలని ఉత్తర్వులు

'సీడీవో'కు చేరిన '11 మీటర్ల' డిజైన్.. నేడో రేపో ఆమోదం!


 

హైదరాబాద్: ‘గోదావరి నదిలో నీటి మట్టం 12.5 మీటర్లు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయడానికి పట్టిసీమ లిఫ్ట్‌ను డిజైన్ చేశారు. కానీ నీటిని తోడేందుకు ఉపయోగించే 'ఫుట్ వాల్వ్'ను మాత్రం 11 మీటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అంటే.. గోదావరి 11 మీటర్ల వద్ద ప్రవహిస్తున్నప్పుడు కూడా నీటిని తోడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 'డిజైన్'ను కాంట్రాక్టర్ 'సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్'(సీడీవో)కు పంపారు. సీడీవో ఆమోదించాక డిజైన్‌కు అనుగుణంగా కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. నేడో రేపో 11 మీటర్ల డిజైన్‌కు సీడీవో ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.



గోదావరి డెల్టాకు నష్టం ఎలా?

ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాకు నీరందించేవి మూడు ప్రధాన కాల్వలున్నాయి. బ్యారేజ్ జలాశయం లెవల్ 13.67 మీటర్లు. మూడు కాల్వలకు జోరుగా నీరందించాలంటే(ఫుల్ సప్లై లెవల్) గోదావరిలో 14 మీటర్ల వద్ద ప్రవాహం ఉండాలి. అంత కన్నా తక్కువగా ఉంటే మూడు ప్రధాన కాల్వలకు వేగంగా నీరు పారదు. గోదావరిలో వరదలు ఉండే 40 నుంచి 60 రోజుల మధ్య కాలంలో మాత్రం ఫుల్ సప్లై లెవల్‌కు ఇబ్బంది ఉండదు. మిగతా రోజుల్లో సమస్య ఉంటుంది. ధవళేశ్వరం ఎగువన పట్టిసీమ వద్ద నిర్మిస్తున్న లిఫ్ట్ ‘ఫుట్ వాల్వ్’ 11 మీటర్ల వద్ద ఉంటుంది. 11 మీటర్ల మట్టం వద్ద 8,500 క్యూసెక్కుల సామర్థ్యంలో నీటిని తోడితే ఫుల్ సప్లై లెవల్‌కు విఘాతం కలుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ‘ఫుల్ సప్లై లెవల్’ ఉండే రోజులు తగ్గిపోతే.. గోదావరి డెల్టాకు నీరందక పంటలు ఎండిపోతాయి. గోదావరిలో 11 మీటర్ల నీటిమట్టం వద్ద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తే వేగంగా ప్రవాహం లేకుంటే జలాశయం ఖాళీ అవుతుంది.

 

 డిజైన్ 14 మీటర్లకు మారుస్తామని చెప్పి నెల

పట్టిసీమ లిఫ్ట్ డిజైన్‌ను 14 మీటర్లకు మారుస్తామని గత మార్చి 29న ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే నెల రోజులు గడిచినా డిజైన్‌ను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. మరోవైపు ‘డిజైన్’కు ఆమోదం తెలపాల్సిన ‘సీడీవో’కు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. డిజైన్‌ను 14 మీటర్లకు మారిస్తే లిఫ్ట్ నిర్మాణ వ్యయం కనీసం రూ. 25 కోట్లు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. లిఫ్ట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ‘14 మీటర్ల’ విషయాన్ని పక్కన పెడుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top