ఐదు నెలల్లో లోకేష్‌ ఆస్తులు చూస్తే కళ్లు బైర్లే

ఐదు నెలల్లో లోకేష్‌ ఆస్తులు చూస్తే కళ్లు బైర్లే - Sakshi


లోకేశ్‌ ఆస్తులు.. 5 నెలల్లో 22 రెట్లు

ఇదీ లోకేశ్‌ ఆస్తుల విలువ పెరుగుదల తీరు

⇒ మొత్తం ఆస్తి రూ.14.5 కోట్లుగా అక్టోబర్‌లో ప్రకటన

తాజా అఫిడవిట్‌లో ఆస్తుల విలువ రూ.330.14 కోట్లు

ఐదు నెలల్లో 2178.20 శాతం పెరుగుదల!

ఇదే సమయంలో తగ్గిన దేవాన్ష్ ఆస్తుల విలువ

ఆడిటర్లకే అంతుచిక్కని లోకేశ్‌ ఆస్తుల లెక్కలు




సాక్షి, అమరావతి: ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆస్తుల ప్రకటన అనేది జిమ్మిక్కేనని, అసలు ఆస్తుల విలువ చెప్పడం లేదన్న ‘సాక్షి’ కథనాలు లోకేశ్‌ ఎన్నికల అఫిడవిట్‌ ద్వారా నిజమని నిరూపితమయ్యాయి. ఏటా ఆస్తులను ప్రకటిస్తూ దేశంలోనే అందరికీ ఆదర్శంగా ఉంటున్నామన్న ‘నారా’ కుటుంబం తెలుగు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టించిందో బట్టబయలైంది. ఐదు నెలల క్రితం లోకేశ్‌ ప్రకటించిన ఆస్తులకు ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన విలువకు పొంతన లేనేలేదు. ఏకంగా ఈ ఐదునెలల్లో లోకేశ్‌ ఆస్తి విలువ 22 రెట్లు పెరిగిపోయింది.



గత ఏడాది అక్టోబర్‌లో గుంటూరులో విలేకరుల సమావేశం పెట్టి మరీ లోకేశ్‌ తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించడమే కాకుండా రాజకీయాల్లో తమలా పారదర్శకంగా ఎవ్వరూ లేరని, తమ కుటుంబంలా అందరూ స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించాలంటూ ప్రగల్భాలు పలికారు. కానీ ఆ ఆస్తుల ప్రకటన ఎంత పారదర్శకంగా ఉందో ఇప్పుడు తేటతెల్లమైంది. షేర్లు, ఇతర చర, స్థిర ఆస్తులతో కలిపి తన పేరు మీద రూ.14.5 కోట్ల విలువైన ఆస్తులను ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గత అక్టోబర్‌లో ప్రకటించారు. ఇప్పుడు అదే వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో మాత్రం తన ఆస్తుల విలువ రూ. 330.14 కోట్లుగా పేర్కొన్నారు.



అంటే గత అక్టోబర్‌లో కంటే ప్రస్తుతం తన ఆస్తుల విలువ సుమారు 21.78 రెట్లు (2178.20 %) పెరిగినట్లు చూపించారు. దీని ప్రకారం చూస్తే గతంలో లోకేశ్‌ ప్రకటించిన ఆస్తుల విలువ తప్పైనా అయి ఉండాలి... లేకపోతే... ఈ ఐదు నెలల్లో అదనంగా ఆస్తులు కూడబెట్టయినా ఉండాలి. పైగా ఇదే సమయంలో హెరిటేజ్‌ రిటైల్‌ వ్యాపారాన్ని ఫ్యూచర్‌ గ్రూపునకు విక్రయించారు. కానీ ఈ లావాదేవీల్లో లోకేశ్‌కు ఎటువంటి నగదు రాలేదు. హెరిటేజ్‌ రిటైల్‌ షేర్లకు బదులు ఫ్యూచర్‌గ్రూపు షేర్లు మాత్రమే బదలాయించడం గమనార్హం.  



కొడుకు ఆస్తుల విలువ తగ్గిందట...

లోకేశ్‌ అఫిడవిట్‌ ప్రకారం ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తులు 72.94 శాతం పెరిగితే... కొడుకు దేవాన్ష్ ఆస్తులు మాత్రం స్వల్పంగా 0.7 శాతం క్షీణించడం గమనార్హం. గత అక్టోబర్‌లో తన భార్య బ్రాహ్మణి మొత్తం ఆస్తుల విలువ రూ. 12.75 కోట్లుగా ప్రకటించిన లోకేశ్‌ ఇప్పుడు మాత్రం రూ. 22.05 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో కొడుకు దేవాన్ష్ ఆస్తుల విలువ రూ. 11.32 కోట్ల నుంచి రూ.11.24 కోట్లకు తగ్గాయి. పెరిగితే అందరి ఆస్తుల విలువ పెరిగాలి... కానీ ఈ ఐదు నెలల్లో ఒక్క లోకేశ్‌ ఆస్తుల విలువ మాత్రమే భారీగా పెరిగి బ్రాహ్మణి ఆస్తుల విలువ స్వల్పంగా పెరగడం, దేవాన్ష్ ఆస్తుల విలువ తగ్గడం వెనుక మతలబు ఏమిటో తలపండిన ఆడిటర్లకు కూడా అర్థం కావడం లేదు. ఈ లెక్కల్లో ఎక్కడా బంగారం, వజ్రాలు వంటి విలువైన ఆభరణాల విలువ తీసుకోలేదు. అలాగే ఇన్నాళ్లు నాయనమ్మ గిఫ్ట్‌గా హైదరాబాద్‌ మదీనాగూడలో ఐదెకరాలు ఇచ్చిందని చెప్పేవారు కానీ దాని విలువ ఎప్పుడూ పేర్కొనలేదు.



ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్‌లో వారసత్వంగా వచ్చిన ఆస్తి విలువ రూ. 38.51 కోట్లుగా పేర్కొనడం గమనార్హం. భార్య, కొడుకుల పేరు మీద 2.3 కేజీల బంగారం, 310.06 క్యారెట్ల వజ్రాలు, 104.94 కేజీల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. వీటికి బంగారం, వజ్రాల ఆభరణాల మార్కెట్‌ విలువ కలిపితే ఆస్తులు ఇంకా ఎన్ని రెట్లు పెరుగుతాయో? లోకేశ్‌ తండ్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్‌‡్షల ఆస్తుల విలువలను కూడా లోకేశ్‌ ఆస్తుల తరహాలో పెరుగుదలను చూపితే ఆయన కుటుంబ ఆస్తులు ఎన్ని వేల కోట్లు దాటతాయో అనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. అబద్ధపు గణాం కాలతో ప్రజలను మభ్యపెట్టడంలో లోకేశ్‌ తండ్రిని మించిన తనయుడయ్యారని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.



అక్టోబర్‌, 19, 2016.................................. మార్చి 7, 2017 (ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా)

 మొత్తం రూ.14.56కోట్లు                             మొత్తం ఆస్తి రూ.330కోట్లు
హెరిటేజ్‌ వాటా రూ.2.52 కోట్లు                      హెరిటేజ్‌ వాటా రూ.273.84కోట్లు
ఆయా కంపెనీల్లో షేర్‌ రూ.1.65 కోట్లు              స్థిరాస్తులు రూ.18 కోట్లు
కారు రూ.93లక్షలు                                    పూర్వీకుల ద్వారా వచ్చినవి రూ.38.52కోట్లు
బ్యాంకు లోన్లు రూ.6.35 కోట్లు                       బ్యాంకు లోన్లు రూ.6.27 కోట్లు

లోకేష్‌ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్‌ పేరిట ప్రకటించిన ఆస్తులు అప్పుడు ఇప్పుడు

అక్టోబర్‌, 19, 2016.................................. మార్చి 7, 2017 (ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా)

బ్రాహ్మణి మొత్తం ఆస్తులు రూ.5.38కోట్లు       బ్రాహ్మణి ఆస్తులు దాదాపు రూ.28 కోట్లు
దేవాంష్‌ మొత్తం ఆస్తులు రూ.11.70కోట్లు       దేవాంష్‌ ఆస్తులు దాదాపు గతంలో చెప్పినన్ని..

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top