నానీ గారిని అడగండి!

నానీ గారిని అడగండి! - Sakshi


ఏవమ్మా.. ఈ పడవలు ఎక్కడ నుంచి తెప్పించారు..? నానీగారిని అడగండి! ట్రాక్టర్‌కు ఎంత కిరాయి ఇస్తారు..? నానీగారిని అడగండి! రోజుకు ఎన్ని లారీల ఇసుక తోలతారు..? నానీగారినే అడగండి

 

రాయపూడి(తుళ్ళూరు): తుళ్లూరు మండలం రాయపూడి ఇసుక రేవులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న ఇసుక క్వారీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం సందర్శించారు. ఇసుకను డంపిగ్ చేసే చోట, లారీలకు లోడు చేయడం, వే బల్లులు ఇచ్చే ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, డ్వాక్రా మహిళల నుంచి నాయకులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.



ఎవర్ని ఏ మాట అడిగినా నానీ గార్ని అడగండి అంటూ డ్వాక్రా మహిళలు సమాధానం చెప్పడం, స్థానిక టీడీపీ నేత పేరును వల్లెవేసిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. క్వారీకి వెళ్లిన వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ మేరుగ నాగార్జున తదితరులు రాయపూడి గ్రామ సమాఖ్య సభ్యురాలు సంపతమ్మను పడవకు, ట్రాక్టర్‌లకు ఇచ్చే కిరాయి..



రోజూ ఎంత మేర ఇసుక లోడ్ చేస్తారనే వివరాలు అడిగారు. ఆమె ఏ ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా నానీగారిని అడగండి అంటూ తప్పుకున్నారు. డంపింగ్ యార్డు వద్ద మహిళలు కూడా తాము రూ.200 కూలికి పనులు చేస్తున్నామని ఇంతకు మించి తమకు ఏమీ తెలియదని చెప్పారు.



 కార్మికుల కడుపు కొడుతున్నారు...

 ఇసుక రేవులను సందర్శించేందుకు వచ్చిన నాయకులవద్ద స్థానిక మత్స్యకారులు, ఇసుక కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ నాయకులు తమ కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌ల నిర్వాహకులు తమ పడవలను రేవులో పెట్టుకోనీయడం లేదని, తమ జీవనాధారం పోయిందని వాపోయూరు.



చేపల పడవలు అమ్మి అప్పులు చేసి ఇసుక పడవలు కొన్నామని, వీటికి పనులు లేకుండా చేసి, వారి పడవలు మాత్రమే ఇసుక రేవుల్లో వినియోగించుకుంటున్నారని తెలిపారు. గతంలో రోజుకు ఇసుక పనిద్వారా రూ.500 నుంచి రూ.1000 కూలీ సంపాదించుకునే వారమని బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాలకు చెందిన ఇసుక కార్మికులు వివరించారు.



అబ్బురాజుపాలెం, బోరుపాలెం, హరిశ్చంద్రపురం గ్రామాలకు చెందిన సుమారు 1200 మంది కార్మికులు ఇసుక క్వారీల మీద ఆధారపడి బతికేవారని, భారీ యంత్రాలు తెచ్చి క్వారీలు నిర్వహించడం వల్ల వందలాది మంది కార్మికులకు పనులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.



 రాత్రి వేళల్లోనూ తరలింపు..

 దీనిపై స్థానిక వెలుగు ఏపీఎం నాగమల్లేశ్వరిని నాయకులు వివరణ కోరగా పడవల విషయం తమకు తెలియదన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే రీచ్ వద్దకు లారీలు వస్తున్నాయని, రాత్రి వేళల్లో డంపిగ్ యార్డు నుంచి మాత్రమే లారీలు లోడు చేసుకుని వెళతాయని వివరణ ఇచ్చారు.



కాగా ఇదంతా అబద్దమని, రాత్రి వేళల్లో కూడా నదిలో నుంచే ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనికి పూర్తి ఆధారాలు తమ వద్ద వున్నాయని చెప్పారు. దీనికి డ్వాక్రా మహిళలు సమాధానం చెబుతూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే తాము విధులు నిర్వహిస్తున్నామని, తరువాత ఏం జరుగుతుందో తెలియదని వివరించారు.



 దందా సాగనివ్వం..

 అమాయకులైన డ్వాక్రా మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు దందా సాగిస్తూ ఇసుక క్వారీలతో కోట్లు దండుకుంటున్నారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. సామాన్యులకు బస్తా ఇసుకను కూడా తీసుకెళ్లే హక్కు లేకుండా చేస్తున్నారని, స్థానికంగా ఉండే కార్మికులకు ఉపాధి, మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



ప్రభుత్వం సామాన్యులకు ధరలు అందుబాటులో లేకుండా క్యూబిక్ మీటర్‌కు రూ.650 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టి కార్మికులకు, మత్స్యకారులకు రేవుల్లో పనులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వీటిపై సత్వరం చర్యలు తీసుకొని, ఇసుక రేవులు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.



డ్వాక్రా మహిళలను వెట్టిచాకిరీకి ఉపయోగిస్తూ ఇసుక దందా సాగిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే జిల్లా స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెనీక్రిస్టినా, పార్టీనేత కత్తెర సురేష్‌కుమార్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబా, సేవాదళ్ కన్వీనర్ చిన్నపరెడ్డి, స్థానిక నాయకులు కొమ్మినేని కృష్ణారావు, బత్తుల కిషోర్, ఎస్టీ నాయకుడు కె.శేషగిరిరావు, బోరుపాలెం సర్పంచ్ డి.బాలమ్మ, పెనుమోలు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top