అబద్ధాల బాబును నిలదీయండి

అబద్ధాల బాబును నిలదీయండి - Sakshi


ప్రజలకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు    

 

బాబు మాటలు నమ్మి రుణాలు కట్టని రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు

రూ. లక్ష రుణానికి 13 వేలు వడ్డీ..

డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల నుంచి బ్యాంకులు సొమ్మును తీసుకుంటున్నాయి

బాబుపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా అని ప్రజలడుగుతున్నారు




గుంటూరు: పూటకో అబద్ధంతో రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిలదీయాలని ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై కర్తవ్యబోధ చేశారు. పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...



ఇటీవలి ఎన్నికల్లో సంస్థాగతంగా మనం తప్పులు చేసి ఉంటే అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీకి కోటీ ముప్పై లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదించారు. చంద్రబాబునాయుడు కూటమికి సుమారు కోటీ ముప్పై ఐదు లక్షల మంది ఓట్లు వేశారు. ఇద్దరి మధ్య తేడా 5.6 లక్షలు మాత్రమే. అది పెద్ద తేడా కాదు. నాకు పార్లమెంటు ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ 5.5 లక్షలు. ఆ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను పెంచింది. 14వ లోక్‌సభలో అగ్రగామిగా నిలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2.8 లక్షల ఓట్లు అటు వైపు నుంచి ఇటు వైపు వచ్చి ఉంటే మనం అధికార పక్షంలో ఉండేవాళ్లం. చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఉండేవారు. ఆ తేడా ఎందుకు వచ్చిందో మనం విశ్లేషించుకోవాలి. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్రమోడీ గాలి పట్టణాల్లో పనిచేయడం. రెండో కారణం చంద్రబాబు అబద్ధాలు.



చంద్రబాబు 87 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రజలను నమ్మించాడు. అది సాధ్యం కాదని తెలిసి మనం కూడా హామీలు ఇచ్చినా, ఆయన ఆడిన అబద్ధాలు మనం ఆడినా మూడు లక్షలు, అంతకన్నా ఎక్కువ ఓట్లు మనకు వచ్చేవి. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఉండేవాడిని. రెండు, మూడు నెలలు తిరగకుండానే రాష్ట్రంలో ప్రతి రైతూ మనల్ని తిట్టుకునేవారు. మీరు కూడా వచ్చి నన్ను ప్రశ్నించేవారు. ఎందుకన్నా మోసం చేశావు అని నిలదీసేవారు.



ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకని అబద్ధాలు ఆడి, మోసాలు చేసి గడ్డి తిని ఉంటే .. ప్రజలకు న్యాయం చేయగలమా? నాకూ గొప్ప ముఖ్యమంత్రిని కావాలనే కోరిక ఉంది. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్లు నిజాయితీతో కూడిన పాలన ఇవ్వాలని ఉంది. 30 ఏళ్లు ఎంత మంచి చేయాలంటే ఆ మంచిని చూసి ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండాలనే తాపత్రయం ఉంది. ఆ తాపత్రయమే నన్ను ఈరోజు రాజకీయాల్లో నడిపిస్తోంది. అలాంటప్పుడు అబద్ధాలు చెప్పి, మోసం చేసి ఏదో ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ తరువాత ఐదేళ్లకే ఇంటికి పంపించేస్తారు. ఆ తరువాతి ఎన్నికల్లోనూ ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. అబద్ధాలు చెప్పేవారి ఫొటోలను ఎవ్వరూ ఇళ్లల్లో పెట్టుకోరు. అందుకే చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పలేదు. నిజాయితీగా రాజకీయాలు చేశా.



చంద్రబాటు మాటలు నమ్మి రైతులు జూన్ 30వ తేదీలోపు రుణాలు కట్టలేదు. ఇప్పుడు 13 శాతం వడ్డీతో రుణం కట్టాలని రైతులకు బ్యాంకులు చెబుతున్నాయి. అంటే బాబు మాటలు నమ్మి రైతు ఒక లక్షకు రూ. 13 వేలు వడ్డీ కట్టాల్సివస్తోంది. ఓ పక్క కరువు ఛాయలున్నా, పంటలు వేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అయినా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడంలేదు. పాత రుణాలు కడితేగాని కొత్తవి ఇచ్చే పరిస్థితి లేదు. బకాయిలు కడితేగాని పంటల బీమా కూడా రాదు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.



డ్వాక్రా అక్కా చెల్లెళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వారి పొదుపు ఖాతాల నుంచి వారికి చెప్పకుండానే సొమ్మును బ్యాంకులు తీసుకుంటున్నాయి. లక్ష రూపాయలకు రూ. 13 వేలు వడ్డీని బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. వీటిపై  బాబును అసెంబ్లీలో నిలదీశాను.



ఇంటికో ఉద్యోగం, ‘బాబు వస్తాడు - జాబు తేస్తాడని’ ప్రకటనలిచ్చారు. ఈ రోజు బాబు వచ్చాడు.. ఉన్న జాబులు పోతున్నాయనే పరిస్థితి. 24 వేల మంది ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. కోటీ యాభై లక్షల కుటుంబాలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాయి. నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో యూ టర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదని అసెంబ్లీలో పట్ట పగలే మాట మార్చారు. ప్రైవేటు ఉద్యోగాలు అయితే ఎవరైనా ఇస్తారు. దానికి బాబు ఎందుకు? నిరుద్యోగ భృతి గురించి బాబు అసలు మాట్లాడటమే లేదు.



కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తానన్నారు. ప్రైవేటు స్కూళ్లలో యజమాన్యాలు రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలు ఫీజు కట్టాలని అడుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజు కట్టాల్సిన పనిలేదు. ప్రైవేటు పాఠశాలల ఫీజు కడతారన్న భరోసాతోనే ప్రజలు బాబుకు ఓట్లు వేశారు. ఇప్పుడు చంద్రబాబును ప్రశ్నిస్తే నోట్లో నుంచి మాట రావటంలేదు.  



బాబు ప్రతి విషయంలోనూ ఇలాంటి అబద్ధాలే చెబుతున్నారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి వంద అబద్ధాలు. రోజుకో అబద్ధం, పూటకో అబద్ధం. అందుకే చంద్రబాబును ప్రజలు రాళ్లతో తరిమి కొడతారు.



ఇసుక క్వారీలను సెక్యూరిటైజ్ చేసి రుణాలు తెస్తున్నానంటున్నాడు. ఇసుక తవ్వకాలపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో బ్యాన్ ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు థాయిలాండ్ నుంచి ఇసుకను తెచ్చుకుంటున్నాయి.



ఎర్రచందనం అమ్మి రుణ మాఫీ చేస్తామంటున్నారు. ఓ మంత్రేమో 8 వేల టన్నుల ఎర్రచందనం వేలం వేస్తే టన్నుకు రూ. 10 లక్షలు చొప్పున రూ. 800 కోట్లు వస్తుందన్నారు. కానీ, చంద్రబాబు 15 వేల టన్నులు అంటున్నారు. పోనీ 15వేల టన్నులే అనుకుందాం. దాన్ని వేలం వేస్తే టన్నుకు రూ. 10 లక్షలు చొప్పున రూ. 1,500 కోట్లు వస్తుంది. ఈ 1,500 కోట్ల రూపాయలతో 1.02 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని బాబు అబద్ధాలు ఆడుతున్నారు. అంతటితో ఆగకుండా.. అడవిలో కోయని ఎర్రచందనం చెట్లను బ్యాంకుల్లో తాకట్టు పెడతానని ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.



ఇన్ని అబద్ధాలతో చంద్రబాబు ప్రజలను నమ్మించాడంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఒక్కటవడమే కారణం. ఎన్నికల ముందు రోజుకో కట్టుకథ, పూటకో అభాండం.. నిజంగా వీళ్లు మనుషులేనా అనిపించేలా చంద్రబాబు దారుణాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.



మనకున్నది, చంద్రబాబుకు లేనిది దేవుడి దయ, ప్రజల గుండెల్లో స్థానం. రాబోయే రోజుల్లో ప్రజలను, దేవుడిని నమ్ముకుని వాళ్లు చేస్తున్న మోసాలను, వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ప్రజలతో కలిసి చంద్రబాబును ప్రశ్నించాలి.



ఈమధ్య కాలంలో చాలా మంది నా దగ్గరకు వచ్చారు. ‘అన్నా ఎవరైనా పిక్‌పాకెట్ చేస్తే పోలీసులు 420 కేసు పెడతారు. ఎవరైనా చిట్‌ఫండ్ మోసం, లేకపోతే డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేస్తే వెంటనే 420 కేసు పెడతారన్న. దేశంలో ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే అతనిపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా’ అని అడుగుతున్నారు.

చంద్రబాబు రాబోయే రోజుల్లో ప్రజల వేడిని, ఆక్రోశాన్ని చవిచూసే పరిస్థితి ఉంది. మళ్లీ జరగబోయే ధర్మపోరాటంలో మనం ప్రజల్లోకి వెళ్లి చెప్పబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇందుకోసం పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలి’ అని జగన్ కార్యకర్తల్ని కోరారు. సమీక్ష సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు.    

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top