ఆ ట్రస్ట్ ఏదో తెలియదా ?


 ప్రభుత్వ, ప్రైవేటుకు వ్యత్యాసం లేదా

 చర్చనీయాంశమైన అశోక్ వ్యాఖ్యలు

 వైద్యకళాశాల కోసం మాన్సాస్ ట్రస్టు

 దరఖాస్తు చేసిందని అందరికీ తెలుసు




 తమ ట్రస్టు అని చెప్పుకోలేకపోయిన అశోక్ గజపతిరాజు

 సాక్షి ప్రతినిధి, విజయనగరం:  ‘మెడికల్ కాలేజ్ ఇప్పటికే ఒకటి ఉంది. మరొకటి ఓ ట్రస్టు అడుగుతోంది.   మీ పత్రికల ద్వారా చూశాను. మూడు నాలుగు మెడికల్ కాలేజీలు ఒకే ప్రాంతంలో ఉంటే అవి ఇబ్బందిపడతాయి. అన్నీ పడిపోతాయి. న్యాణ్యత కొరవడుతుంది.ప్రభుత్వమైనా, ప్రైవేటైనా మెడికల్  కాలేజ్ కదా. అక్కడ చదివే పిల్లలంతా డాక్టర్లవుతారు.’ ఇవీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సోమవారం కేంద్రాస్పత్రిలోని పరికరాల ప్రారంభోత్సవ అనంతరం విలేకర్ల వద్ద చేసిన వ్యాఖ్యలు  ఇప్పుడీ వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. వైద్య కళాశాల కోసం దరఖాస్తు చేసిన ట్రస్టు తనకేదో తెలియదన్నట్టు అశోక్ మాట్లాడారు. ప్రభుత్వ స్థాయిలో జరగాల్సినదంతా జరిగిపోయినప్పటికీ ఆ ట్రస్టు అడుగుతుందని పత్రికల్లో చూశానని చెప్పడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటులో ఎక్కడ చదివినా వైద్యులే అవుతారని హితబోధ చేసిన కేంద్రమంత్రికి,  విద్యార్థులకొచ్చే ప్రయోజనాల వ్యత్యాసాలు తెలియవా అన్న సందేహాన్ని రేకెత్తించారు.

 

 మాన్సాస్ ట్రస్టుకు వైస్ చైర్మనైన అశోక్‌కు తెలియదా?

 ప్రైవేటు వైద్య కళాశాల ఏదో ట్రస్టు అడుగుతోందని, అది కూడా పత్రికల్లో చూశానని అశోక్ గజపతిరాజు చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలీ ప్రైవేటు  కళాశాల కోసం దరఖాస్తు చేసింది మాన్సాస్ ట్రస్టు  అని జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం తెలుసు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటు చేయాలని అనేక ఆందోళనలు జరిగాయి. శాసనసభలో సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.   సీఎం చంద్రబాబునాయుడు సైతం మాన్సాస్ ట్రస్టు ప్రైవేటు కళాశాలను ఏర్పాటు చేస్తుందని  ప్రకటించారు. జిల్లాకొచ్చిన వైద్య ఆరోగ్యశాఖామంత్రి, ఇతరత్రా మంత్రులు బహిరంగంగా వెల్లడించారు.    

 

 అలాంటిది ఆ ట్రస్టు వైస్ చైర్మనైన అశోక్ గజపతిరాజుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికే వైద్య కళాశాల ఏర్పాటు  కోసం ప్రభుత్వ ఆనుమతితో మాన్సాస్ ట్రస్టు భూములను   వేలం కూడా వేశారు. జిల్లా కేంద్రాస్పత్రు క్లీనికల్ అటాచ్‌మెంట్ కింద మాన్సాస్ ట్రస్టు ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాల కోసం ఇచ్చేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా స్పష్టం చేసింది. ఈ విధంగా తన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ స్థాయిలో జరిగే వ్యవహారాలన్నీ అశోక్‌కు తెలియవన్నట్టు మాట్లాడారు.  తమ ట్రస్టు అని చెప్పుకోలేకపోయారు.

 

 ప్రభుత్వ, ప్రైవేటుకు  తేడా తెలియదా


 ప్రభుత్వ, ప్రైవేటులో ఎక్కడ చదవినా వైద్యులే అవుతారని అశోక్ చెప్పడం జిల్లా ప్రజల్ని  మరింత విస్మయానికి గురి చేసింది. జిల్లాకు మూడు నాలుగు వైద్య కళాశాలు ఏర్పాటు చేయాలని ఎవరూ కోరలేదు. ఇప్పటికే నెల్లిమర్లలో ప్రైవేటు వైద్య కళాశాల ఉంది. మరొకటి ప్రభుత్వ వైద్య కళాశాలైతే బాగుంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

 

 ప్రజలకు  ఉచితంగా ఉన్నత వైద్యసేవలందడమే కాకుండా తక్కవ ఫీజుతో వైద్య విద్యనభ్యసించేందుకు విద్యార్థులకు అవకాశం వస్తుంది. ఒకవేళ ప్రైవేటు వైద్య కళాశాలే ఏర్పాటు చేద్దామనుకుంటే ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న పార్వతీపురంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అక్కడి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించడం ద్వారా చాలామంది ప్రాణాలు నిలబెట్టవచ్చనేది ప్రజల అభిప్రాయం.  ఆ తేడా తెలియదన్నట్టుగా అశోక్ వ్యాఖ్యలుండటం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి.

 

 ఓ ట్రస్టు అనడం సరికాదు  

 కేంద్రమంత్రి స్థాయిలో వైద్య కళాశాలను ఓ ట్రస్టు అడుగుతోందని చెప్పడం సరికాదు. మాన్సాస్ ట్రస్టు పెడుతుందని జిల్లా ప్రజలందరికీ తెలుసు. దానిపై ఆందోళనలు కూడా జరిగాయి. అలాంటి ఆ ట్రస్టు వైస్ చైర్మనైన అశోక్ గజపతిరాజుకు వైద్య కళాశాలను అడుగుతున్నట్టు తెలియదా. ఇప్పటికే భూ ముల వేలం, ఇతరత్రా కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ స్థాయిలో అన్నీ జరిగిపోతున్నా మాన్సాస్ ట్రస్టే అని చెప్పుకోవడానికి ఎందుకంత ఇబ్బంది. ఎక్కడ చదవినా వైద్యులే అవుతారని అందరికీ తెలుసని, ప్రభుత్వ వైద్య కళాశాలైతే రోగులకు ఉచిత వైద్యసేవలు, విద్యార్థులకు తక్కువ ఫీజుతో వైద్య విద్యను చదువుకోవడానికి అవకాశం ఉంటుందనేది తెలియదా.             

                                                                                                    - బీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top