ఆరిన ఆశా దీపం


ఆయనది మధ్య తరగతి కుటుంబం.. బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. పిల్లలు తన లాగా కాష్టపడకూడదనున్నాడు.. ఎంత శ్రమైనా సరే తనే పడి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు.. పెద్ద కుమారుడిని సీఏ చదివిస్తున్నాడు.. పెద్ద ఉద్యోగం చేయాలని ఆశపడ్డాడు.. అయితే ఆయన కలలు కల్లలయ్యాయి.. చేతికొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

 

ప్రొద్దుటూరు క్రైం: రూరల్ పరిధిలోని ఖాదర్‌బాద్ గ్రామ సమీపంలో లారీ ఢీ కొన్న సంఘటనలో మోటార్‌సైకిల్‌పై వస్తున్న యనమల రాజేశ్వరరెడ్డి (17) అక్కడికక్కడే మృతి చెందాడు. అతను చాపాడులో శ్రీరామనవమిని ముగించుకుని వస్తుండగా ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ఎర్రగుంట్లలోని శ్రీరాములపేటకు చెందిన విజయభాస్కర్‌రెడ్డి బేల్దారి పని చేసుకుని జీవనం సాగించేవాడు. అతనికి రాజేశ్వరరెడ్డి, అమరనాథరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.



పెద్ద కుమారుడు రాజేశ్వరరెడ్డి గుంటూరులోని మాస్టర్ మైండ్ కాలేజీలో సీఏ, అమరనాథరెడ్డి 9వ తరగతి చదువుతున్నారు. విజయభాస్కర్‌రెడ్డిది మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ తనలాగా పిల్లలు కష్టపడకూడదని బాగా చదివిస్తున్నాడు. వారిద్దరిని ఎలాగైనా పెద్ద చదవులు చదివించి ప్రయోజకులను చేయాలని ఎప్పుడూ ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే రాజేశ్వరరెడ్డిని సీఏ చదివిస్తున్నాడు. కొడుకులు ప్రయోజకులు అవుతున్నారని ఎన్నో కలలు కన్నారు. తమ జీవితాలను బాగు చేస్తారని ఆశపడ్డారు. ఈ క్రమంలో ఇటీవల మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న పెద్ద కుమారుడు సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడు.

 

అవ్వగారింటికి పండుగకు వెళ్లివస్తుండగా:

చాపాడులో జరిగే శ్రీరామనవమి పండుగకు రావాలని రాజేశ్వరరెడ్డి అవ్వ ఫోన్ చేయడంతో అతను బంధువులతో కలిసి శనివారం అక్కడికి వెళ్లాడు. పండుగ వేడుకలు ముగించుకుని ఆదివారం ఉదయం ఎర్రగుంట్లకు మోటార్‌సైకిల్‌లో తన మామ రఘురామిరెడ్డితో కలిసి బయల్దేరాడు. వారి వాహనం ఖాదర్‌బాద్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది.



ఈ సంఘటనలో రాజేశ్వరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియడంతో చాపాడు, ఎర్రగుంట్లలో ఉన్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ ముసలయ్య జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. రూరల్ ఏఎస్‌ఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

 

ఎర్రగుంట్లలో విషాదం:

 ఎర్రగుంట్ల: రాజేశ్వరరెడ్డి మృతితో ఎర్రగుంట్లలో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి ఎర్రగుంట్ల ఎంపీపీ లక్ష్మీదేవి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఎర్రగుంట్ల టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top