జన్మకిది చాలు

జన్మకిది చాలు


వేడుకగా రథ సప్తమి మహోత్సవం

ఏడు వాహనాలపై ఊరేగిన మలయప్ప

సుమారు రెండు లక్షల మందికిపైగా

హాజరు   16 గంటల్లో ఏడు వాహనాలఊరేగింపు

వీఐపీలు, కూడలి ప్రాంతాల్లో తోపులాట

అశేష భక్త జనం మధ్య చక్రస్నానం


 

రథసప్తమి సందర్భంగా ఏడు వాహనాలపై ఊరేగిన శ్రీహరిని చూసేందుకు రెండు కళ్లూ చాల్లేదు. దివ్య తేజోమూర్తిని ద ర్శించుకున్న భక్తులు ఈ జన్మకిది చాలంటూ ఆనంద పరవశులయ్యూరు. శ్రీవారి పుష్కరిణి     జన సంద్రంగా మారింది. భక్త జనకోటి హరినామ స్మరణతో సప్తగిరులూ పులకించారుు. మలయప్ప వాహన సేవలతో తిరుమల వైకుంఠాన్ని తలపించింది.

 

తిరుమల: ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన శ్రీవారి రథసప్తమి మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా సాగింది. పదహారు గంటల్లో మొత్తం ఏడు వాహనాలపై మలయప్ప తిరు వీధుల్లో  ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సూర్య, చంద్రప్రభ, గరుడ, హనుమంత, చిన్న శేషవాహనాల్లో మలయప్ప మాత్రమే ఊరేగారు. కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనమిచ్చారు.



సూర్యప్రభ వాహనంతో ప్రారంభం..



ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన సూర్యప్రభ వాహన సేవ   40 నిమిషాల్లోపే ఉత్తర మాడవీధి ప్రారంభానికి చేరుకుంది. గంటా ఇరవై నిమిషాల పాటు స్వామివారు సూర్యప్రభ వాహన సేవపై నిరీక్షించిన సూర్య కిరణాలు స్వామివారి పాదాలు తాకారుు. దివ్య తేజోమూర్తి మంగళ రూపాన్ని తొలి కిరణాల్లో దర్శించుకుని భక్తకోటి ఆనంద పరవశులైంది. ఉదయం 7:45 గంటలకు సూర్యప్రభ వాహనం ముగిసింది. ఉదయం తొమ్మిది గంటలకు చిన్న శేషవాహనం ప్రారంభించారు. మార్గంమధ్యలో సర్కారు హారతులు మాత్రమే అనుమతించి కేవలం 50  నిమిషాల్లోనే ముగించారు. తర్వాత 11 గంటలకు ప్రారంభమైన గరుడ వాహన సేవ కోలాహాలంగా సాగింది. వాహన సేవను 50 నిమిషాల్లోనే ముగించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన హనుమంత వాహనం 1:50 ముగిసింది. మధ్యాహ్నం 2:10 గంటలకు సుదర్శన చక్రతాళ్వారు శ్రీవారి సన్నిధి నుంచి ఊరేగింపుగా వరాహ స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. పుష్కరిణి గట్టుపై వైదికంగా స్నపన తిరుమంజనం ( అభిషేకం) కార్యక్రమాలు పూర్తి చేశారు. అశేష భక్తుల మధ్య శాస్త్రోక్తంగా స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ ఈవో సాంబశివరావు,  తిరుమల జేఈవో శ్రీనివాసరాజు దంపతులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనంపై శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా పుర వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఆరు గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగారు. చివరగా రాత్రి ఎనిమిది గంటలకు చంద్ర ప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. రథసప్తమి సందర్భంగా ఆలయంతోపాటు ఆలయం వెలుపల పూల అలంకరణలు, విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకున్నాయి.



పోటెత్తిన భక్తజనం..



రథసప్తమికి భక్తులు పోటెత్తారు. సూర్యప్రభ, గరుడ వాహనం, కల్పవృక్ష వాహనం, చంద్రప్రభ వాహన సేవల్లో స్వామివారిని  భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన  సూర్యప్రభ వాహన సేవకు ముందుగానే భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆలయ ప్రాంతానికి చేరుకున్నారు. అన్ని గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర మాడవీధి నుంచి తూర్పు మాడ వీధి వరకు  భక్తుల మధ్య తోపులాట జరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యహరించి క్రమబద్ధీరించారు. శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానం సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వాహన సేవల్లో మొత్తం రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నట్టు ఈవో, జేఈవో ప్రకటించారు. వాహన సేవల ముందు వీఐపీలు, ఇతర భక్తులు వేచి ఉండకుండా నియంత్రించేందుకు వేద  విజ్ఞానపీఠం విద్యార్థులతో ప్రత్యేకంగా వైదిక హారాన్ని ఏర్పాటు చేశారు.



ఆకట్టుకున్న సాంస్కృతిక కళా బృందాలు



రథసప్తమి సందర్భంగా నిర్వహించిన సంగీత , సాంస్కృతిక కళా బృందాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కర్ణాటక ఉడిపి డప్పు వాయిద్య కళాకారుల విన్యాసం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కోలాటాలు, చెక్క భజనలు, వివిధ దేవతామూర్తులు వేషధారణలు చూసి భక్తులు ఆనంద పరవశులయ్యారు.  ఆలయ నాలుగు మాడ వీధులు, దర్శనం కోసం వేచి ఉన్న క్యూలైన్లలో మొత్తం లక్షన్నర మందికి పైగా ఆహార పదార్థాలు పంపిణీ  చేశారు.

 

అధికారుల సమన్వయం .


.

టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు స్వీయ పర్యవేక్షణలో అన్ని విభాగాల అధికారులు రథసప్తమి వేడుకలో సమష్టిగా పనిచేశారు. ఆలయ పేష్కార్ సెల్వం, ఏఈవో శివారెడ్డి, ఆలయ  ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి, బొక్కసం ఇన్‌చార్జి గురురాజాతో  కలసి వాహన సేవలను ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇన్‌చార్జి సీవీఎస్‌వో శ్రీనివాస్, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, తిరుమల ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి, డీఎస్పీలు నరసింహారెడ్డి, రవిమనోహరాచారితో కలసి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.



 ఆలయానికి విద్యుత్ కాంతులు



రథసప్తమి పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. డీఈ రవిశంకర్‌రెడ్డి పర్యవేక్షించారు. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మహాద్వారం నుంచి గర్భాలయం వరకు పుష్పాలతో అలంకరించారు. ఫెక్సీలు, పుష్పాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top