త్వరలో అదనపు ఆధార్ కేంద్రాలు

త్వరలో అదనపు ఆధార్ కేంద్రాలు

  • సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

  • అనంతగిరి:  పాడేరు డివిజన్ లోని అన్ని మండలాల్లో అదనపు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సోమవారం అనంతగిరి మండలంలో టోకురు, బొర్రా, అనంతగిరి ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆయనకు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.



    ఆధార్‌కార్డులు రాక చాలామంది గిరిజనులకు రేషన్ బియ్యం అందడం లేదన్న ఫిర్యాదుపై స్పందించారు. తక్షణమే కార్డులు ఉన్న వారి జాబితా వెంటనే ఇవ్వాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. బొర్రా, టోకురు గుమ్మ, అనంతగిరి, ఎగువశోభ పంచాయతీల్లో భూపట్టాలు పంపిణీ చేయాలని గిరిజన సంఘం నాయకులు కోరారు. పట్టాలు ఇచ్చేందుకు అనుకులంగా ఉన్నచోట పట్టాదార్ పాస్‌బుక్‌లు సిద్దంచేస్తే మళ్లీ అనంతగిరి వచ్చినప్పుడు పంపిణీ చేస్తానన్నారు.



    కివర్ల డీఆర్ డిపోలో రేషన్ పంపిణీ చేయాలని జీసీసీ మేనేజర్‌ను ఆదేశించారు. నాన్‌షెడ్యుల్డ్ పంచాయతీల్లో భూ ఆక్రమణలను ఆపాలని సబ్ కలేక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కబ్జాదారుల జాబితా తనకు అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కె.అప్పారావు. తహశీల్దార్ భాగ్యవతి, ఎంపీడీవో సాంబశివరావు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు డి.గంగరాజు, ధర్మన్న మోష్యి నాగులు పాల్గొన్నారు.

     

    వైద్య సేవలు లోపిస్తే వేటు



    డుంబ్రిగుడ:  గిరిజనులకు సేవల్లో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. సోమవారం డుంబ్రిగుడ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన కుల గణన సర్వే నివేదికలను పరిశీలించారు. అనంతరం ఇక్కడి పీహెచ్‌సీలో వైద్యుల పనితీరును సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ చిన్న వయస్సుల్లోనే ఐఏఎస్ అధికారిగా నియమితుడినైన తాను మన్యంలో సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.



    పాడేరు డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని తుంగలోకి తొక్కి గిరి భూముల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటానని చెప్పారు. డుంబ్రిగుడ మండలం అరకు సంత గ్రామంలో గిరిజనేతరులు చేపడుతున్న కట్టడాలపై దృష్టిసారించాలని తహాశీల్దార్‌ను ఆదేశించారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top