కళాకారుడు సంపూర్ణ ఉద్యమకారుడు


రుణోదయ మహాసభల్లో సతీష్‌చందర్

ఒంగోలు: ప్రజా సమస్యలను కళల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించి వారిని చైతన్యపరచడంలో కళాకారుడు కీలకపాత్ర పోషిస్తాడని సంపాదకుడు సతీష్‌చందర్ పేర్కొన్నారు. అలాంటి కళాకారుడు సంపూర్ణ ఉద్యమకారుడని కొనియాడారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులోని సుబ్బారావు పాణిగ్రాహినగర్‌లో జరిగిన ప్రతినిధుల సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. పది శాతం యువత సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ‘నమో’ జపం చేస్తుంటే దాని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తప్పితే పేద, శ్రామిక వర్గాల స్థితిగతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.  కార్యక్రమంలో భాగంగా ‘ప్రజాకళలు-సాహిత్యం’ అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.



ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన అరుణోదయ కళాకారులు ఆలపించిన గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

 రెండు రాష్ట్రాల కార్యవర్గాల ఎన్నిక: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ, తెలంగాణ కార్యవర్గాలను ఆదివారం ఒంగోలులో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సిహెచ్.జాలన్న (ప్రకాశం), ప్రధాన కార్యదర్శిగా డి.అంజయ్య (ప్రకాశం), ఉపాధ్యక్షుడిగా రామన్న (పశ్చిమగోదావరి), సహాయ కార్యదర్శిగా భీమశంకర్ (తూర్పుగోదావరి), కోశాధికారిగా ఎన్.సామ్రాజ్యం (గుంటూరు), మరో పదిమంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పి.వేణు (హైదరాబాద్), ప్రధాన కార్యదర్శిగా ఎ.నిర్మల (ఖమ్మం), సహాయ కార్యదర్శిగా వెంకన్న (నల్లగొండ), కోశాధికారిగా అశోక్ (కరీంనగర్), మరో నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మరికొందరిని ఎన్నుకోవలసి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top