అరెస్టులు.. అడ్డంకులు


ఆత్మకూరురూరల్/కొత్తపల్లి: అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు.. రోడ్డుకు అడ్డంగా తవ్విన గుంతలు.. నాయకుల గృహ నిర్బంధాలు..అక్రమ అరెస్టులు..144 సెక్షన్ అమలు.. ఇవేవి రాయలసీమ రైతాంగ లక్ష్యాన్ని దెబ్బతీయలేదు. ప్రభుత్వ నిర్బంధాలను లెక్క చేయకుండా వేలాది మంది రైతులు సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన కోసం తరలి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..సీమ భవిష్యత్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయబోమని తేల్చిచెప్పారు. ఎక్కడిక్కడే అలుగు శంకుస్థాపన కోసం శిలాఫలకాలు వేసి తమ లక్ష్యమేమిటో చాటిచెప్పారు.

 

 సిద్ధేశ్వరం అలుగు..రాయలసీమ రైతుల కలల ప్రాజెక్టు. దీని కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. సీమ ప్రాంత వాసి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సైతం పలుమార్లు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై వినతి పత్రాలు ఇచ్చారు. అయినా స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో రైతులంతా చైతన్యమై.. మంగళవారం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి శంకుస్థాపన చేయాలనుకున్నారు. సీమ నలుమూలల నుంచి సుమారు 3వేల వాహనాల్లో ఈ కార్యక్రమం కోసం 30 వేల మంది రైతులు ఉదయమే బయలు దేరారు. అయితే కడప నుంచి వచ్చే మార్గంలో దువ్వూరు మొదలు.. ప్రతి మండల కేంద్రంలోనూ పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రైతులను సిద్ధేశ్వరం వెళ్లకుండా నిలవరించారు. అలాగే అనంతపురం వైపు నుంచి వచ్చే వారిని నందికొట్కూరు, జూపాడుబంగ్లా తదిర పోలీస్ స్టేషన్‌ల పరిధిల్లో నిలబెట్టారు. వెలుగోడులో వాహనాలను నిలబెట్టడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో పోలీసులపై రైతులు తిరగబడడంతో వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. ఆత్మకూరులో సైతం పోలీసు వలయాన్ని  రైతులు ఛేదించాల్సి వచ్చింది.

 

 ఇదీ వ్యూహం..

 సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తమను అరెస్టు చేస్తారన్న ఆలోచనతో  సాధన కమిటీ ముఖ్యనాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, వైఎన్ రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు సోమవారం మధ్యాహ్నం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. మంగళవారం ఉదయం  రైతుపల్లె గ్రామంలో ప్రతీకాత్మకం గా సిద్దేశ్వరం అలుగు శంఖుస్థాపన చేశారు. ఆతరువాత ప్రధాన రహదారుల్లో కాకుండా కింది రస్తాల గుండా ఎర్రమటం గ్రామం చేరుకోగానే ఆత్మకూరు డిఎస్పీ సుప్రజ అక్కడికి చేరుకుని అలుగు సాధన సమితి నాయకులు బొజ్జాను అదుపులోనికి తీసుకునే యత్నం చేశారు. రాయలసీమ జేఏసీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వేలాది మంది రైతాంగం పోలీసులను దూరంగా తోసి తమ వాహనాలను సిద్ధేశ్వరం వైపు తమ నాయకుడితో కలిసి తరలి వెళ్లారు. అక్కడ ఆలయం ఎదుట సమావేశం కాగా నాయకులు ప్రసంగించారు.

 

 ఈ సమావేశమనంతరం డీఎస్పీ సుప్రజ తన సిబ్బందితో అక్కడికి వచ్చి బొజ్జా ధశరథరామిరెడ్డిని అరెస్టు చేసి కొత్తపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం ఆయనను వదలి వేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top