మంచితనమే ప్రాణం తీసింది

మంచితనమే ప్రాణం తీసింది - Sakshi


బీటెక్‌ విద్యార్థిని హత్యోదంతంలో పరిచయస్తుడే నిందితుడు

ప్రొద్దుటూరు క్రైం: మంచితనమే బీటెక్‌ విద్యార్థిని హైందవి ప్రాణం తీసింది. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం దారుణ హత్యకు గురైన కడపన హైందవి కేసులో.. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. వివరాలను డీఎస్పీ భక్తవ త్సలం వెల్లడించారు. రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన నవీన్‌కుమార్‌ ప్రొద్దుటూరులో డిగ్రీ  చదువుతున్నాడు. అతను ఫస్టియర్‌ చదివేటప్పుడు గోకుల నగర్‌ లోని హైందవి వాళ్ల ఇంటి కింది పోర్షన్‌లో అద్దెకున్నాడు.



ఈ క్రమంలో ఆ కుటుంబీకులతో నవీన్‌ చనువుగా ఉండేవాడు.తన పరీక్షలు పూర్తయ్యాక నవీన్‌ గది ఖాళీ చేయడంతో  ఆ గదిలో వేరే విద్యార్థులుంటున్నారు. కాగా, నవీన్‌కు స్నేహితుడైన టం గుటూరుకు చెందిన నరహరి శుక్రవారం తన ప్రేయసితో ప్రొద్దుటూరుకు వచ్చాడు. కొద్దిసేపు ఉండటానికి గది కావాలని నవీన్‌ను అడిగాడు. దీంతో అతను గతంలో తానున్న హైందవి  వాళ్లింటికి వెళ్లి.. కొద్దిసేపు నిద్రపోతానంటూ అక్కడుంటున్న విద్యార్థుల నుంచి గది తాళం తీసుకున్నాడు.



అనంతరం వారు కాలేజీకి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి హైందవి, ఆమె తండ్రి జయప్రకాశ్‌రెడ్డి కూడా బయటకు వెళ్లడంతో నరహరిని పిలిచి గది అప్పగించాడు. అనంతరం నవీన్‌ బైక్‌ తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. కొంతదూరం వెళ్లేసరికి పెట్రోల్‌ లేక బైక్‌ ఆగిపోవడంతో దారి పక్కన నిల్చున్నాడు. ఇంతలో రిపేర్‌కు ఇచ్చిన స్కూటీ తీసుకొని వస్తున్న హైందవికి అతను కనిపించాడు. దీందో ఆమె తనను ఇంటి వద్ద డ్రాప్‌ చేసి స్కూటీ తీసుకెళ్లి పెట్రోలు తెచ్చుకోమని చెప్పింది.



ఇంటికి వెళ్లిన తర్వాత హైందవి ఒంటరిగా ఉండటంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న నవీన్‌ హైందవి చెయ్యి పట్టుకునేందుకు యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నవీన్‌ ఆమె గొంతు నులిమేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె బతికితే తనకు ప్రమాదమని భావించిన నవీన్‌.. చాకుతో ఆమె గొంతుపై పొడిచి హత్య చేశాడు. వెళ్తూవెళ్తూ.. ఆమె ఒంటిపై ఉన్న కమ్మలు, చైన్, సెల్‌ఫోన్‌తో పాటు స్కూటీ తీసుకొని పారిపోయాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top