బరితెగింపు


సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రజాస్వామ్యం అపహాస్యమైంది..స్వేచ్ఛగా ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను అధికార పార్టీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. తామేమీ తక్కువ తినలేదన్నట్లు పోలీసులు సైతం ఓవర్షాన్ చేశారు. నంద్యాలలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులను బనాయించారు. అంతటితో ఆగకుండా వెనువెంటనే అరెస్ట్ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ను తొందరగా వెళ్లిపోవాలంటూ పోలీసులు చేసి న ఒత్తిళ్ల నేపథ్యంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘మా ఓటు కూడా మీరే వేస్తారా’ అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల నియామవళిలోని ఏ సెక్ష న్ల ప్రకారం... ఓటు వేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను త్వరగా వెళ్లమని చెబుతారని నిలదీశారు.

 

 ఈ నేపథ్యంలోనే ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ, నంద్యాల డీఎస్పీతో ఆయన ఎన్నికల నియామవళిని చూపించాలని కోరారు. అయితే, తమ విధులకు ఆటంకం కల్పించారని.. తాను ఎస్సీని కాబట్టే తనను డోంట్ టచ్ మీ అంటూ భూమా నాగిరెడ్డి మాట్లాడారని నంద్యాల త్రీ టౌన్ పోలీసులో డీఎస్పీ దేవాదానం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డిపై సెక్షన్ 353, 188, 506 ఐపీసీతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

 

 హోటల్‌లో హల్ చల్...!

 ఓటమి భయం పట్టుకున్న అధికార పార్టీ నేతలు ఓటు వేసేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్లు బళ్లారి చౌరస్తాలోని ఒక హోటల్‌లో సేద తీరుతున్నారు. ఓటింగుకు బయలుదేరుతుండగా..పోలీసులతో వెళ్లి వారి వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాహనానికి అడ్డంగా నిలబడి ఓటింగుకు పోకుండా నిలవరించే ప్రయత్నం చేశారు.

 

 ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో విషయం తెలుసుకున్న వైఎ స్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర రె డ్డి, ఎమ్మెల్యే మణిగాంధీ, కొత్త కోట ప్రకాష్ రె డ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి డి. వెంకటేశ్వరరెడ్డిలు అక్కడకు చేరుకున్నారు. తమ ఓటర్లు ఓటు వేయడానికి వస్తుంటే అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైఎ స్సార్‌సీపీ నేతల రంగ ప్రవేశంతో ఓటు వేసేం దుకు వెళ్తున్న ఓటర్లను... మీరు ఓటర్లేనా అని పోలీసులు వాకబు చేసి చివరకు వారిని అక్కడి నుంచి పంపించేశారు.

 

 అక్కడి నుంచి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఓటు వేసిన వీరిని.. మీరు ఎవరికి ఓటు వేశారో చెప్పాలంటూ అధికార పా ర్టీ నేతలు పోలింగ్ కేంద్రం వద్ద అడుగుతూ నా నా హంగామా సృష్టించారు. తాము ఓటు ఎవరి కి వేశామో చెప్పమని ఓటర్లు కాస్తా స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు.

 

 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతల హడావుడి

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా బరిలో ఉన్న టీడీపీ నేతలు ఉదయం నుంచే హంగామా మొదలు పెట్టారు. వచ్చిన ఓటర్లను పలకరిస్తూ... వారి వెంట ఉన్న సహాయకులకు సూచనలు ఇస్తూ కనిపించారు. డోన్ నియోజకవర్గ ఇంచార్జీ కేఈ ప్రతాప్... కర్నూలు పోలింగ్ కేంద్రంలో నానా హడావుడి చేశారు. ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి అభ్యర్థులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలోకి కనీసం ఓటరు కార్డులు కూడా చూయించకుండానే పంపించాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం కనిపించింది. పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు సహకరించారన్న ఆరోపణలు వినిపించాయి. మొత్తం మీద ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాలో నానా హడావుడి చేశారన్న  అభిప్రాయం నెలకొంది.

 

  బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు ఎంపీటీసీ బాల ఉస్సేనిని కిడ్నాప్ చేశారంటూ.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు యత్నాలు సాగాయి. టీడీపీ నేతలు ఈమేరకు పోలీసులపై భారీగా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top