ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు


 కాళ్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాకు రానున్న సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత,   ఎమ్మెల్యేలు వేటుకూరి శివ, కలెక్టర్ కె.భాస్కర్ శుక్రవారం ఏర్పాట్లను  పరిశీలించారు.  మోడి గ్రామంలో హెలిఫాడ్, కలవపూడి హైస్కూల్ ప్రాంగణంలో సభా వేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో సీఎం పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశా రు. శనివారం ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్‌లో మోడి గ్రామానికి వస్తారు. అక్కడ ఆయన మొగదిండి స్ట్రయిట్ కట్ డ్రెయిన్‌లో కిక్కిస కోసే యంత్రాన్ని ప్రా రంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం కలవపూడి హైస్కూ ల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ నీరు-చెట్టు, స్వచ్ఛభారత్, పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొం టారు. అనంతరం పశువుల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. మోడల్ స్కూల్‌గా ఎంపికైన కలవపూడి జెడ్పీ హైస్కూల్‌ను సందర్శిస్తారు. హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచి చంద్రబాబు ప్రసంగిస్తారు. సభ అనంతరం  మోడీ నుంచి హెలికాఫ్టర్‌లో పాలకొల్లు నియోజకవర్గ పర్యటనకు వెళతారు.  

 

 సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

 ఎస్పీ కె.రఘురామిరెడ్డి

 ఏలూరు  (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి తెలిపారు. 17 మంది డీఎస్పీలు, 49 మంది సీఐలు, 116 మంది ఎస్సైలు, 185 మంది ఏఎస్సైలు, 300 హెడ్ కానిస్టేబుళ్లు, 830 మంది కానిస్టేబుళ్లు,  ఉమెన్ హెడ్ కానిస్టేబుళ్లు 100 మంది, స్పెషల్ పార్టీ 8 మంది, ఏఎఆర్ ప్లాటిన్‌లు 6, 30 మంది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కలిపి మొత్తం 1500 మంది పోలీసులను బందోబస్తుకు నియమించామనిఎస్పీ తెలిపారు.

 

 దొడ్డిపట్లలో ఏర్పాట్లు పూర్తి

 దొడ్డిపట్ల (యలమంచిలి) : దొడ్డిపట్లలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పరిశీలించారు. సీఎం పర్యటనకు దొడ్డిపట్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. మంత్రి పీతల సుజాతతో పాటు రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత విలేకరులతో మాట్లాడుతూ పేదరికంపై గెలుపే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రవాస భారతీయులను జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ద్వారా ఉత్తేజపరచి గ్రామాల్లో వారి సేవలను వినియోగించాలనే ధ్యేయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

 

 హుదూద్ తుపాను కారణంగా జన్మభూమి కార్యక్రమం వాయిదా పడడంతో గత నెలలో పింఛన్లు ఇవ్వలేని వారికి ఈ నెలలో రెండు నెలల పింఛన్లు కలిపి ఇస్తామన్నారు. కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ గత నెలలో గ్రామ కమిటీలు నుంచి వచ్చిన పింఛన్ అర్జీలలో 45 వేల మందికి ఈ నెల కొత్త పింఛన్‌లు మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తొలిసారిగా నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి కార్యకర్తలంతా తరలిరావాలని కోరారు. సీఎం ఇలపకుర్రు హైస్కూల్ గ్రౌండ్‌లో హెలికాఫ్టర్ దిగి అక్కడి నుంచి ఇలపకుర్రు పంచాయతీ కుమ్మరపాలెంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. దొడ్డిపట్లలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డిపట్ల హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగే జన్మభూమి-మా ఊరు సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top