టీడీపీని అడ్రస్‌ లేకుండా చేయండి

టీడీపీని అడ్రస్‌ లేకుండా చేయండి - Sakshi

- ఓటర్లకు ఆక్వా పార్కు బాధితుల విజ్ఞప్తి

తుందుర్రులో భారీ ర్యాలీ

 

సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమవరం టౌన్‌ : ఓటు వేసే వారిని కాటు వేసే నైజం సీఎం చంద్రబాబునాయుడిదని పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ఆక్వాపార్కు బాధితులు ఆరోపించారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీని అడ్రస్‌ లేకుండా చేయాలని వారు నంద్యాల ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా తుందుర్రు, జొన్నలగరువు, కె బేతపూడి ప్రజలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ డౌన్‌డౌన్, చంద్రబాబు డౌన్‌.. డౌన్‌ అంటూ నినదించారు. ర్యాలీని పోలీసులు లాఠీలతో అడ్డుకునే ప్రయత్నం చేయగా మహిళలు, పోరాట కమిటీ నాయకులు లెక్కచేయకుండా ముందుకు సాగారు. తొలుత తుందుర్రులో ప్రారంభమైన ర్యాలీ జొన్నలగరువు మీదుగా కంసాల బేతపూడిలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌  విగ్రహం వద్దకు చేరుకుంది. చంద్రబాబుకు మంచి బుద్ధిని కల్పించాలని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్‌ విగ్రహానికి మహిళలు పాలాభిషేకం చేశారు. నంద్యాల ప్రజలు ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని వారు కోరారు. 

 

నంద్యాలలో టీడీపీని అడ్రస్‌ లేకుండా చేయాలి

అనంతరం సీపీఎం నేతలు జేఎన్‌వీ గోపాలన్, కవురు పెద్దిరాజులు మాట్లాడుతూ, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అదేరీతిలో రాష్ట్ర ప్రజలకూ నెరవేర్చలేని హామీలిచ్చి, ప్రాజెక్టుల పేరుతో నిధుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పోరాట కమిటీ నేతలు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ, ముచ్చెర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు ఒక మాట.. అధికారమొచ్చాక మరో మాట చంద్రబాబు నైజమని విమర్శించారు. మూడేళ్లుగా ఇక్కడ ఫుడ్‌పార్కు వద్దని తాము పోరాటం చేస్తుండగా... సీఎం చంద్రబాబు మమ్మల్ని ఆహ్వానించి మీకు అన్యాయం చేయబోనని భరోసా ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ తుందుర్రులో ఫ్యాక్టరీ కట్టించడం దారుణమన్నారు.



మంత్రులు సైతం ఇలాగే వ్యవహరించారని.. అడ్డు చెప్పిన తమపై అక్రమంగా కేసులు బనాయించారని మండిపడ్డారు. ఏడాదికి మూడు పంటలు పండే ఈ గ్రామాలను గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మించి ఏడారి చేయడమేనా పాలన అంటే అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలు తలచుకుంటే టీడీపీ అడ్రస్‌ గల్లంతేనని పోరాట కమిటీ మహిళా నాయకులు ఎంపీటీసీ జవ్వాది వెంకటరమణ, ఆరేటి సత్యవతిలు హెచ్చరించారు. నంద్యాలలో పరిస్థితి చూస్తుంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి భారీ మెజారిటీ ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఈ ర్యాలీలో పోరాట కమిటీ నేతలు కొయ్య సంపత్, బెల్లపు సత్తిబాబు, సముద్రాల సత్యవాణి, చీడే నాగమణి, వీరవెంకటలక్ష్మీ తదితరులు ఉన్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top