అపు‘రూపం’!

అపు‘రూపం’! - Sakshi


సాక్షి ప్రతినిధి, కడప : విశ్వసనీయతే ప్రామాణికంగా రాజకీయాలు నెరిపిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్కసారి మాట ఇస్తే ఎంత కష్టమైనా సరే నెరవేర్చాలని తపించేవారని విశ్లేషకులు సైతం కొనియాడుతుంటారు. మెడిసిన్ పూర్తి కాగానే జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు. ఆ తర్వాత పులివెందులలో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరున 30 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించారు. అనతి కాలంలోనే పేదల డాక్టర్‌గా, రూ.2 వైద్యునిగా గుర్తింపు పొందారు. తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20వేల 496 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.



ఆనాటి నుండి 2009 వరకు ప్రతిసారి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఓటమెరుగని ధీరుడిగా చరిత్రకెక్కారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, మరో రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు సీఎల్పీ నేతగా, 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా  దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదవులను అలంకరించారు. ఏపదవి చేపట్టినా అందులో రాజకీయ నేతలకు మార్గదర్శకంగా నిలిచారని విశ్లేషకులు వివరిస్తున్నారు.



 కాంగ్రెస్‌కు జీవం పోసిన ప్రజాప్రస్థానం....

 వరుసగా రెండు పర్యాయాలు అధికారం కోల్పోయి అధఃపాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానాన్ని రూపొందించారు. కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజల దరికి చేరేందుకు సీఎల్పీ నేతగా 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి  పదవి దివంగత నేత వైఎస్సార్‌ను వరించింది. 2004 మే 14న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలు రద్దుపై  తొలి, మలి సంతకాలు చేశారు.



 ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, పావలా వడ్డీ రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డులు జారీ, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఙం, 108, 104 వైద్య సేవలు, కిలో రూ.2 బియ్యం, ట్రిపుల్ ఐటీల ఏర్పాటు, రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు, ఒకటేమిటి, అన్ని వర్గాల వారికి అనువైన పథకాలను రూపొందించారు. అలాగే వాటి అమలులో చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అమలయ్యేలా కృషి చేశారని ప్రత్యర్థులు సైతం కొనియాడారు. 2009 ఎన్నికల్లో విశ్వసనీయత పేరుతో బరిలో దిగిన ఆయన 156 అసెంబ్లీ స్థానాలను, 33 పార్లమెంటు స్థానాలను ఒంటిచేత్తో గెలిపించుకున్నారు. 2009 మే 20న మరోమారు ముఖ్యమంత్రిగా ప్రజలమధ్యనే ప్రమాణస్వీకారం చేపట్టారు. ప్రభుత్వ పథకాల తీరు తెన్నులను పరిశీలించేందుకు రచ్చబండ కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళుతూ 2009 సెప్టెంబర్ 2న పంచ భూతాల్లో ప్రజానేత ఐక్యమయ్యారు.

 

 జిల్లాపై ప్రత్యేక ముద్ర....

 వైఎస్సార్ జిల్లా మూడున్నర దశాబ్ధాల క్రితం నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది.  వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని జిల్లా నలుమూలలా పరుగులు పెట్టించారు. 2004-09 వైఎస్ యుగంలో సమగ్రాభివృద్ధి దిశగా జిల్లాను పయనింపచేశారు. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల,జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో యోగివేమన యూనివర్శిటీ, జె.ఎన్.టియు ఇంజనీరింగ్ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ అసుపత్రి, దంత వైద్యశాల, అలాగే ట్రిపుల్ ఐటీ, ఐ.జి కార్ల్ పశు పరిశోధన కేంద్రం, దాల్మీయా, భారతి సిమెంటు కర్మాగారాలు, గోవిందరాజా స్పిన్నింగ్ మిల్స్, సజ్జల పాలిమర్స్, బ్రహ్మణీ స్టీల్స్, లాంటి పరిశ్రమలను నెలకొల్పారు.



జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను డాక్టర్ వైఎస్‌ఆర్ హయాంలో పరుగులు పెట్టించారు. సుమారు రూ.12వేల కోట్లతో జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. గాలేరు నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నల్, గండికోట వరదకాల్వ,గండికోట ఎత్తిపోతల పథకాలను వైఎస్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వరాయ సాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, వెలిగల్లు, తెలుగు గంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మహానేత 66వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజానీకం సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top