ఇక ‘మీ సేవ’లో ఏపీఎంఐపీ


ఒంగోలు టూటౌన్: ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) సేవలు ఇకపై ‘మీ సేవ’లో అందనున్నాయి. రైతులు పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం తొలగనుంది.   మీసేవ కేంద్రంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరి.. అనంతరం అధికారులే రైతుల వద్దకు వెళ్లనున్నారు. తుంపర సేద్యం, బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకునే రైతులు ఇక నుంచి ఆన్‌లైన్‌లో  నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



ఇప్పటి వరకు అమలు చేస్తున్న మేన్యువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ‘మీ సేవ’లో సేవలు అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. పంటల ఉత్పాదకతను, ఉత్పత్తిని పెంచి రైతు తలసరి ఆదాయం పెంచేందుకు 2003లో సూక్ష్మనీటిసాగు పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25,520.97 హెక్టార్లలో బిందు సేద్యం, తుంపర సేద్యం అమలు చేశారు. 22,545 మంది రైతులు ఈ పథకం కింద లబ్ధిపొందుతున్నారు. ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని రైతులందరికీ అందుబాటులో తీసుకొచ్చి, పారదర్శకంగా అమలు చేసేందుకు ఏపీఎంఐపీ చర్యలు వేగవంతం చేసింది.



 దరఖాస్తు చేయడం ఇలా..

 బిందుసేద్యం, తుంపర సేద్యం పథకం కోసం దరఖాస్తు చేయాలంటే ముందుగా రైతు పాస్‌పోర్టు ఫొటో, భూ యాజమాన్య హక్కు పత్రం, 1 బీ గానీ, టైటిల్‌డీడ్‌గాని, రిజిస్టర్‌టైటిల్ డీడ్‌లో ఉన్న మొదటి పేజీ, చివరి పేజీ జిరాక్స్ కాపీ తీసుకోవాలి. ఆధార్ కార్డు, గుర్తింపు కలిగిన రేషన్ కార్డులేదా ఓటరు కార్డును తప్పని సరిగా మీ సేవకేంద్రానికి తీసుకెళ్లాలి. రూ.35 చెల్లిస్తే.. రైతు చెప్పిన పథకానికి సంబంధించిన దరఖాస్తుతో పాటు జిరాక్స్‌కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.



 దీంతో దరఖాస్తు రిజిస్టర్ అయినట్లు రైతు సెల్ నంబర్‌కు యూనిక్ ఐడీ క్రమసంఖ్య ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో వస్తుంది. అనంతరం మీ సేవ కేంద్రం నిర్వాహకులు నమోదైన దరఖాస్తుల వివరాలను ప్రతి సోమవారం, గురువారంలో ఏపీఎంఐపీ కార్యాలయానికి పంపుతారు. ఈ నూతన విధానం ఈ నెల 10 నుంచి అమలవుతోంది.



 రైతుల వద్దకే అధికారులు:

 దరఖాస్తు చేసిన రైతులు ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరగకుండా రైతుల వద్దకే అధికారులు వెళతారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, యూనిట్ విలువ, రాయితీ వివరాలు తెలియజేస్తారు. దరఖాస్తు ఫారం వివిధ దశల్లో  కలెక్టర్ వద్దకు చేరుతుంది. అనంతరం ఆయన ఆమోదం పొందుతుంది.



 కోరుకున్న కంపెనీ ద్వారా..

 పథకానికి సంబంధించిన తుంపర సేద్యం, బిందు సేద్యం పరికరాలు రైతు కోరుకున్న కంపెనీ నుంచి పొందవచ్చు. 90 శాతం రాయితీ కాగా 10 శాతం రైతు వాటా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పాత పద్ధతిలోనే రాయితీ అమలవుతోంది. ఈ ఏడాది రాయితీ పెరిగే అవకాశం ఉంది.

 

 ఈ ఏడాది లక్ష్యం: ఈ ఏడాది 2,170 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు ఏపీఎంఐపీ డెరైక్టర్  కె మోహన్‌కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల పూర్తి చేసే సమయంలో మీ సేవ కేంద్రం నిర్వాహకులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తమ కార్యాలయ సిబ్బంది సెల్: 8374449626కి ఫోన్‌చే సి వెంటనే నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top