పచ్చ ముద్ర పడితేనే పింఛన్!

పచ్చ ముద్ర పడితేనే పింఛన్! - Sakshi


- పింఛన్ కోసం జిల్లా వ్యాప్తంగా 42,578 దరఖాస్తులు

- ప్రస్తుతం 13,800 మంది అర్హులుగా గుర్తింపు

- నియోజకవర్గానికి వెయ్యి చొప్పున 10 వేల కొత్త పింఛన్లు మంజూరు

- నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌కే పెత్తనం కట్టబెడుతున్న వైనం

కడప రూరల్ :
కొత్తగా కేటాయిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ రాజకీయ రంగు పులుముకుంది. జన్మభూమి కమిటీలతో త మకు న్యాయం జరగడం లేదని అర్హులు గగ్గోలు పెడుతున్న తరుణంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 1000 చొప్పున జిల్లాకు 10 వేల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఈ పింఛన్లు ఎవరికి కేటాయించాలనే బాధ్యతలను ఆయా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లకు అప్పజెప్పినట్లు సమాచారం. వారి సూచనలు, సలహాల మేరకు కొత్త పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. మొన్నటికి మొన్న 13 వేలకు పైగా కొత్త పింఛన్లు మంజూరు చేయగా అవన్నీ జన్మభూమి కమిటీలో ఉన్న టీడీపీ నేతలు సూచించిన వారికే దక్కాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంజూరైన కొత్త పింఛన్లు పాలక నేతల కనుసన్నల్లో మెలిగే వారికే అందుతాయనే ప్రచారం సాగుతోంది.

 

ఇన్‌చార్జ్ మంత్రి ఆదేశాలతోనే..

కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ఆయా నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిల ఆధ్వర్యంలో జరగాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే తంతు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని యం త్రాంగం చెబుతోంది. నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ సూచన మేరకే ఏ పంచాయతీలో ఎన్ని పింఛన్లు మం జూరు చేయాలనేది నిర్ణయిస్తారని సమాచారం. ఆ ప్రకారం జన్మభూమి కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నాయి.  

 

వేలల్లో అర్హులు.. కొందరికే పింఛన్లు

మొన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేతలు, కల్లు గీత కార్మికులు మొత్తం 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 14,243 మందిని రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించగా ఇటీవల అందులో 8409 మందికి మాత్రమే కొత్త పింఛన్లను మంజూరు చేశారు. పెండింగ్‌లో 35,575 దరఖాస్తులు మిగిలిపోగా, మళ్లీ కొత్తగా 7 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 42,575 దరఖాస్తులు ఉండగా అందులో ప్రభుత్వం 13,800 మందిని అర్హులుగా గుర్తించింది.



ఆ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఉన్న 170 నియోజకవర్గాలకు నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1.70 లక్షల కొత్త పింఛ న్లను మంజూరు చే సింది. ఆ ప్రకారం వైఎస్‌ఆర్ జిల్లాకు నియెజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 10 వేల పింఛన్లను కేటాయించారు. అర్హులు ఎంత మంది ఉన్నప్పటికీ ఎంపిక చేసిన వారికి మాత్రమే   పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఈ విషయంపై జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top