అప్పన్న ఆలయ ధ్వజస్తంభం తొలగింపు

అప్పన్న ఆలయ ధ్వజస్తంభం తొలగింపు - Sakshi


బయల్పడిన బ్రిటీష్ కాలం

నాటి వెండి, రాగి నాణేలు

19వ శతాబ్ధం నాటివిగా నిర్ధారణ

ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట


 

సింహాచలం: వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభాన్ని బుధవారం తొలగించారు. 1894లో (120 ఏళ్ల కిందట) ప్రతిష్టించిన ధ్వజస్తంభం కర్ర పుచ్చిపోవడంతో ఈనెల 26 నుంచి తొలగింపు పనులు చేపట్టారు. బుధవారం ధ్వజస్తంభం అడుగుభాగాన్ని పూర్తిగా తొలగించారు. ధ్వజస్తభం అడుగుభాగం వెలికి తీసిన తరువాత గరుడ యంత్రం లభించడంతో దానికి శాస్త్రోక్తంగా హారతులిచ్చి ఆలయంలో స్వామి దగ్గర ఉంచారు. అనంతరం మట్టి తీసే సమయంలో బ్రిటీష్‌కాలం నాటి వెండి, రాగి నాణేలు బయల్పడ్డాయి.



ఇవి బ్రిటీష్‌కాలంనాటి  నాణేలుగా ఈవో రామచంద్రమోహన్ పేర్కొన్నారు. నాణేలు 1,800 నుంచి 1,890 వరకు ఉన్న సంవత్సరాలు ముద్రించి ఉన్నాయి. మొత్తం చిన్నా, పెద్దా కలిపి 1,658 రాగి నాణేలు, 140 గ్రాములు బరువు ఉన్న 43 వెండి నాణేలు, తీగముక్కలు, నమూనా ధ్వజస్తంభం లభ్యమయ్యాయి. అలాగే 22 గ్రాముల బరువు ఉన్న బంగారం రేకుముక్కలు, నమూనా చిన్న ధ్వజస్తభం లభించాయి. 18 పగడాలు, రెండు ముత్యాలు లభ్యమయ్యాయి. అలాగే అడుగు భాగంలో లభ్యమైన అప్పటి ఆకు ఇంకా పచ్చగానే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవాదాయశాఖ విశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇ.వి.పుష్పవర్ధన్, చినగదిలి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, వీఆర్వో సత్యం దొర, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈ మల్లేశ్వరరావు, ఏఈవో ఆర్.వి.ఎస్. ప్రసాద్, ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, అర్చకులు తొలగింపు పనులు పర్యవేక్షించారు.


ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట




ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్టా కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి వెభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి సూచనల మేరకు నూతన ధ్వజస్తభం ప్రతిష్టను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ధ్వజస్తంభం వెలికితీతలో లభ్యమైన నాణేలు నూతన ధ్వజస్తంభం ప్రతిష్టలో తిరిగి వేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, శాస్త్ర ప్రకారం, వైదికుల సూచనల ప్రకారం నడుచుకుంటామన్నారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నూతన ధ్వజస్తభం ప్రతిష్ట నిర్వహిస్తామని స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top