మహిళను వివస్త్రను చేసి కొట్టిన గ్రామస్తులు

గ్రామస్తులు ధ్వంసం చేసిన ఇంట్లోని సామానులు - Sakshi


ఇల్లు, సామగ్రి ధ్వంసం

వడ్డిపల్లిగేటు అప్పలకుంటలో దౌర్జన్యం




హిందూపురం: ఓ మహిళ ఇంటిని ఖాళీ చేయించేందుకు గ్రామస్తులు సభ్యసమాజం తలదించుకునే దారుణానికి ఒడిగట్టారు. నడివీధిలోకి లాక్కొచ్చి వివస్త్రను చేసి కొట్టారు. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని వడ్డిపల్లి గేటు అప్పలకుంటలో సోమవారం ఈ ఘటన జరిగింది. తనను వివస్త్రను చేసి దాడిచేయడంతోపాటు లైంగికంగా వేధించారని బాధితురాలు గౌరీబాయి హిందూపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.



ఫిర్యాదు మేరకు.. కల్యాణదుర్గం ప్రాంతానికి చెందిన గౌరీబాయి కుటుంబం 15 సంవత్సరాల కిందట అప్పలకుంటలో ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటోంది. మూడేళ్ల కిందట భర్త మృతిచెందగా ప్రస్తుతం గౌరీబాయి, పదో తరగతి చదువుతున్న కుమారుడు బాబూనాయక్ ఉంటున్నారు. ఆమెను ఇల్లు ఖాళీ చేయాలని కొన్నాళ్లుగా గ్రామస్తులు హింసిస్తున్నారు. ఆంజనేయస్వామి గుడి కట్టేందుకు ఆ స్థలం కావాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయమై ఆమె నాలుగు నెలల కిందట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌరీబాయికి మరో ఇంటిపట్టా ఇప్పించి ఇల్లు కట్టుకునే వరకు ఆమె ఆ ఇంట్లోనే ఉండేలా పోలీసులు పంచాయితీ చేశారు.



ఈ నేపథ్యంలో సోమవారం పోలీసులంతా ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బలరాముడు, రామగిరి సూరి, బేల్దారి హనుమంతు, శివప్ప, మరికొందరు ఉదయం 8 గంటల ప్రాంతంలో గౌరీబాయిని ఇంట్లోంచి బయటకు ఈడ్చుకొచ్చారు. ఆమెను వివస్త్రను చేసి గ్రామస్తులంతా కొట్టారు. తరువాత ఆమె ఇంటి పైకప్పు రేకును, ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న నగలు, రూ.20 వేల నగదు మాయమైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు గాయపడిన గౌరీబాయిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.



ఘటనా స్థలంలో విచారించిన పోలీసులు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు వాస్తవమేనని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రామస్తులు బలరాముడు, రామగిరి సూరి, బేల్దారి హనుమంతు, శివప్ప, మరో 15 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు అత్యాచారయత్నం, మహిళను అవమానించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ ఆంజనేయులు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top