ఇక సర్కారీ కిక్కు

ఇక సర్కారీ కిక్కు - Sakshi

  • జూలై నుంచి రాష్ట్రంలో తమిళనాడు తరహా మద్యం విధానం

  • స్వయంగా వ్యాపారంలోకి దిగనున్న రాష్ట్ర ప్రభుత్వం

  • 4 వేలకు పైగా దుకాణాల నిర్వహణకు నిర్ణయం

  • ముడుపులు ముట్టచెప్పినవారి బ్రాండ్లే దుకాణాల్లో విక్రయం

  • అధినాయకత్వానికి ఇక కాసులే కాసులు

  • పదివేల మంది తెలుగు తమ్ముళ్లకు ఉపాధి

  • సాక్షి, హైదరాబాద్: మద్యాన్ని మొదట్నుంచీ ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా తమిళనాడు తరహా మద్యం విధానంపై కన్నేసింది. తమిళనాడులో మద్యం దుకాణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దీంతో ఆ విధానం తీరు తెన్నులను, మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించడంలో దాగున్న ‘ప్రయోజనాలను’ మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు లోతుగా అధ్యయనం చేశారు. అంతే రాష్ట్రంలోనూ ఆ తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయానికొచ్చేశారు. ఒకపక్క ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులన్నిటినీ ప్రైవేటుపరం చేస్తూ పోతున్న ప్రభుత్వం.. మద్యం దుకాణాలను మాత్రం తామే నిర్వహిస్తామనడంపై అధికారవర్గాల్లో పలు గుసగుసలు విన్పిస్తున్నాయి.

     

    రాజధాని అభివృద్ధి పనులు మొదలు, సాగునీరు, రహదారులు, ఉన్నత, సాంకేతిక విద్య, వైద్య రంగాల్లోని అనేక పనులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే ప్రభుత్వం చేపడుతోంది. కొన్ని పనులనైతే పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం ప్రైవేటు రంగంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని మాత్రం.. ఇకపై స్వయంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయించడం వెనుక పెద్ద గూడు పుఠాణీయే ఉందని తమిళనాడు మద్యం విధానం గురించి బాగా తెలిసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు. తమిళనాడు మద్యం విధానాన్ని గురించి ఆరా తీస్తే తెలిసిందేమిటంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే.. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తోంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అక్కడ ప్రభుత్వానికే కాదు.. అధినాయకత్వానికి కూడా ముడుపుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందనే ఆరోపణలున్నాయి. అంటే అధినాయకత్వానికి బాగా ముడుపులు ముట్టజెప్పిన సంస్థల మద్యం బ్రాండ్లనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తారన్నమాట.

     

     ఏదైనా బ్రాండుకు చెందిన కంపెనీ అధినాయకత్వంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో ఆ బ్రాండును మద్యం దుకాణాల్లో విక్రయించరు. ఆ బ్రాండు స్టాకు లేదని చెబుతారు. ఈ అంశాలన్నిటినీ బాగా అధ్యయనం చేసిన తర్వాతనే మన రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మద్యం విధానానికి మొగ్గు చూపిందని సమాచారం. అన్ని విధాలా ఆదాయం సమకూర్చే ఈ విధానం బాగా నచ్చబట్టే.. ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడం వల్ల వచ్చే విమర్శలను సైతం లెక్క చేయకుండా.. ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. వచ్చే జూలై నుంచి తమిళనాడు తరహా మద్యం విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోందంటే.. ఇక బెల్టు షాపుల్ని యధేచ్చగా నడుపుకునేందుకు అవకాశం ఉంటుంది.  తద్వారా ప్రభుత్వానికి, అధినాయత్వానికి డబ్బు సంపాదన సులభ సాధ్యమవుతుందని, మరోవైపు 10 వేల మంది తెలుగు తమ్ముళ్లకు కూడా ‘ఉపాధి’ కల్పించవచ్చనేది సర్కారు యోచనగా ఎక్సైజ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

     

     దుకాణానికి ముగ్గురు తమ్ముళ్ల నియామకం

     రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలున్నాయి. తమిళనాడు తరహా మద్యం విధానంలో.. ఈ 4,380 మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దుకాణానికి ముగ్గురు చొప్పున తెలుగు తమ్ముళ్లను మద్యం విక్రయాల నిమిత్తం నియమిస్తుంది. వారు నిర్దేశిత బ్రాండ్లకు చెందిన మద్యం, బీర్లను మాత్రమే ఆయా దుకాణాల్లో విక్రయిస్తారు. ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా నివారించేందుకు ప్రతి జిల్లాలో డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. బెల్టు షాపులు పూర్తిగా లేకుండా చేస్తామని ప్రచారం చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక అలాంటి చర్యలేవీ చేపట్టపోగా.. విచ్చలవిడి బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌లతో మద్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా చేసింది. ఇప్పుడు సర్కారే స్వయంగా మద్యం వ్యాపారంలో దిగుతోంది. ప్రస్తుతం నిర్ధారించిన దుకాణాలకు వేలం పాట ద్వారా లెసైన్స్‌లను లాటరీ ద్వారా మంజూరు చే  సే విధానం అమల్లో ఉంది. ఈ విధానం జూన్ నెలాఖరుతో ముగియనుంది. దీంతో జూలై నుంచే తమిళనాడు తరహా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top