ఊరించి.. ఉసూరుమనిపించి!


కర్నూలు విద్య: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం మాట తప్పుతోంది. తాజాగా నిరుద్యోగ బీఎడ్‌ల ఆశలపై నీళ్లు చల్లింది. ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని నమ్మబలికిన చంద్రబాబునాయుడు.. చివరకు కేంద్రం అనుమతి ఇవ్వలేదంటూ చేతులెత్తేశారు. గురువారం రాష్ట్రంలో 9,061 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 730  ఉపాధ్యాయుల భర్తీకి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించగా అన్నింటికీ ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ప్రాథమిక పాఠశాల విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులే అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.



ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఇదిలాఉంటే ఎన్నికల హామీలో భాగంగా బీఎడ్‌లకు ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనలను సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఇలాంటి ప్రతిపాదననే చేసిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సైతం నిబంధనలు అంగీకరించబోవని స్పష్టం చేశామని.. ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టంగా నిబంధనలు సండలించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.



ఇచ్చిన హామీ నిలుపుకోవడంలో భాగంగా గత ఏడాది ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసిన వాటిలో స్కూల్ అసిస్టెంట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత తప్పదనే భావనతో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడంలో ఆలస్యమవుతుందనే సాకుతో చడీచప్పుడు కాకుండా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఎన్నికల హామీ విస్మరించిన బాబు తీరుపై బీఎడ్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డీఎస్సీగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇకపై టెట్‌కామ్ టెర్ట్‌గా మార్పు చేశారు.



గత ప్రభుత్వం నిర్వహించిన టెట్‌కు స్వస్తి పలికారు. రెండింటికీ ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. ఇదివరకు టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సైతం తాజాగా పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకోనున్నారు. మూడు గంటల రాత పరీక్షలో భాగంగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు 15 నిముషాల ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఎస్జీటీ ప్రశ్న పత్రంలో 180 ప్రశ్నలకు 180 మార్కులు.. స్కూల్ అసిస్టెంట్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top