వ్యవసాయం అరకొరే


 - ప్రత్యేక బడ్జెట్‌లో యాంత్రీకరణ, విత్తన సబ్సిడీకి నిధులు నామమాత్రం

- ఊసేలేని వ్యవసాయవర్సిటీ 

- డాట్ సెంటర్ అభివృద్ధికి అరకొరగా నిధులు

- ఇరిగేషన్ పనులకు మంగళం

- సోమశిల ఆధునికీకరణ అనుమానమే..

- సంగం,పెన్నా బ్యారేజీల నిర్మాణం ప్రశ్నార్థకం

- రుణమాఫీకి పంగనామం

 సాక్షి, నెల్లూరు : వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం మరోమారు అన్నదాతలను వంచించింది. వ్యవసాయ దాని అనుబంధ రంగాలకు కలిపి కేవలం రూ.13,108 కోట్లతో బడ్జెట్ రూపొందించి మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేసింది. అంకెల గారడీ తప్ప  కేటాయించిన బడ్జెట్‌తో ఏ ఒక్క పథకాన్నీ కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా జిల్లాకు ప్రాణాధారమైన సోమశిల పరిధిలోని ఇరిగేషన్ అభివృద్ధి పనులపై సర్కారు వివక్ష చూపింది. జిల్లాపై కక్ష కట్టి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. విత్తన, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీలు లేకపోగా విత్తన పరిశోధనకు కేటాయింపులు కరువయ్యాయి.



మొత్తం మీద చంద్రబాబు వ్యవసాయ బడ్జెట్ వంచనతప్ప మరొకటి కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వ్యవసాయశాఖ పరిధిలో జిల్లాకు గతంలో రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, నార్మల్ స్టేట్‌ప్లాన్, విత్తన సబ్సిడీలు, జింకు, జిప్సం సబ్సిడీలు కలిపి ఏడాదికి రూ.15 వేల కోట్లు నిధులు వచ్చేవి. ప్రస్తుత బడ్జెట్‌లో యాంత్రీకరణకు రాష్ట్రం మొత్తానికి కలిపి కేవలం రూ. 90 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ఇక రైతులకు సబ్సిడీ యంత్రాలు లేనట్లే.

 కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల తరువాత అత్యధికంగా వరి పండించే జిల్లా నెల్లూరు. ఏడాదికి 10 లక్షల ఎకరాలు, కృష్ణ నీళ్లు సక్రమంగా వస్తే 15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. వైఎస్సార్ మరణం తరువాత కిరణ్ సర్కార్  జిల్లాలోని

 సాగునీటి అభివృద్ధి పనులను విస్మరించింది.



ప్ర స్తుతం జిల్లాలో ఆయకట్టు కు నీరందించే కాలువల్లో పూడిక పెరిగి సక్రమంగా నీళ్లందే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే అరకొరగా జరుగుతున్న పనులను సైతం ఆపారు. సంగం, పెన్నా బ్యారేజీ పనులు ఎక్కడ వేసిన గొం గలి అన్నట్లుండి పోయాయి. సోమశిల హైలెవల్ కెనాల్, అటవీ భూసేకరణ, జలయజ్ఞం పనులకు రూ.2100 కోట్ల నిధులు అవసరం కాగా ప్రస్తుతం బడ్జెట్‌లో కేవలం సోమశిలకు కేవలం రూ.24 కోట్లు నాలుగు జిల్లాల పరిధిలో తెలుగు గంగకు ఇచ్చింది కేవలం రూ.80 కోట్లు మాత్రమే. ఈ లెక్కన ఇరిగేష న్ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు.  పనులు సాగకపోతే  జిల్లాలో వరిసాగు భారీగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

రైతు రుణమాఫీకి  నామమాత్రంగా కూడా నిధులు ఇవ్వలేదు. మొత్తం రూ.35 కోట్ల రుణమాఫీ చేయాల్సివుండగా బడ్జెట్‌లో  కేవలం రూ.5 కోట్లు కే టాయించడం దారుణం. ఈ లెక్కన తొమ్మిదేళ్లకు గానీ రుణమాఫీ పూర్తికాదు. రూ.లక్షలోపు రుణాలకు వడ్డీ లేకుండా, రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ అంటూ బడ్జెట్‌లో ఆర్భాటపు ప్రకటన చేయడం వింతే. అసలు రైతులకు రు ణాలు ఇచ్చేపరిస్థితి లేకుండా చేసిన సర్కారు రాయితీలు ప్రకటించడం విడ్డూరం.హైఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కు మొత్తం రూ.210 కోట్లు బడ్జెట్‌లో చూపారు.



ఒక్క నెల్లూరు జిల్లాలో ఈ సిస్టం పూర్తికావడానికే రూ.200 కోట్లు అవసరమవుతాయి. ఇక  మత్స్యశాఖకు కేవలం రూ.14.85 కోట్లు కేటాయిం చారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే మత్స్యసంపద ఉత్పత్తి  అధికంగా ఉంటుం ది. వందలాది కోట్లు కేటాయిస్తే తప్ప ఈ శాఖకు ఉపయోగం వుండదు. ఇక ఉచిత విద్యుత్ కు రూ.3188 కోట్లు అన్నది చాల తక్కువ బడ్జెట్ అని నిపుణుల అభిప్రాయం. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవసాయ బడ్జెట్ అంటూ ప్రభుత్వం కాకిలెక్కలు వేసి నామమాత్రపు బడ్జెట్‌తో సరిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

 

జిల్లాలోని మూడు చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు రూ. 32 కోట్ల వరకూ రావల్సివుంది. రైతులు ఫ్యాక్టరీల చుట్టూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. బడ్జెట్‌లో చింతలదేవిలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు ఊసేలేదు. పోనీ అక్కడ పశుగణాభివృద్ధి క్షేత్రం అయినా అభివృద్ధి చేస్తున్నారా అంటే అదీ కనిపించడంలేదు. బడ్జెట్‌లో దీనికి ఇచ్చింది నామమాత్రపు నిధులే. మొత్తంగా శుక్రవారం ప్రభుత్వం  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌పై విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ మాత్రం బడ్జెట్ కేటాయింపులకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకని  రైతుసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top