ఎవరికైనా ‘స్టాంప్’

ఎవరికైనా ‘స్టాంప్’

  •  చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్

  •   ఏపీ పోస్టల్ ఫిలాటెలిక్  ఎగ్జిబిషన్ ప్రారంభం

  • విజయవాడ : నగరంలో ఏపీ పోస్టల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ (అప్పెక్స్-2014)  గురువారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యాన వేదిక ఫంక్షన్ హాలులో  ఏర్పాటు చేసిన  ఎగ్జిబిషన్‌ను  చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ ప్రారంభించారు.   మొత్తం 18వేలకు పైగా స్టాంపులను ప్రదర్శించారు. ఇందులో గురజాడ అప్పారావు, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి  ఇతర దేశాలకు సంబంధించిన  స్టాంప్‌లు ఉన్నాయి.  ప్రదర్శన ఈనెల 26తేదీ వరకు కొనసాగుతుంది.  



    తొలిరోజు  వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు.  తొలుత నిర్వహించిన సభలో సుధాకర్  మాట్లాడుతూ.. ఫిలాటెలిక్ అంటే స్టాంప్ అని, ప్రజలలో చాలా మందికి స్టాంప్ కలెక్షన్ ఒక అలవాటుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు ముఖ్యమైన వ్యక్తుల  ఫొటోలతోనే స్టాంప్‌లు ముద్రించామని,  ఇకమీదట ఎవరైనా సరే.. పోస్టాఫీసుకు వచ్చి వారి ఫొటోతో స్టాంప్ కావాలంటే వెంటనే తయారు చేసి ఇవ్వబడతాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ స్టాంపులు  వస్తాయని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత విజయవాడలో స్టాంపుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   

     

    సత్యసాయిబాబా, గురజాడ అప్పారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, అరసవెల్లి, నేషనల్ పోలీస్ అకాడమీ పేర్లపై గత ఏడాది స్టాంప్‌లు విడుదల చేసినట్లు తెలిపారు.  ఆగస్టు నుంచి విద్యార్థులకు పోస్టాఫీసులో జరిగే కార్యకలాపాలపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం విజయవాడ రీజియన్ పరిధిలోని స్పెషల్ కవర్‌లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద  తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top