లేఖ పేరుతో మరో నాటకం!

లేఖ పేరుతో మరో నాటకం!


అమరావతి: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి తలపెట్టిన ఛలో అమరావతి పాదయాత్రను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మరో నాటకానికి తెర లేపింది. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అధ్యయన నివేదికను త్వరగా ఇవ్వాలని మంజునాథ కమిషన్‌కు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి హడావుడిగా లేఖ రాశారు. గత నవంబర్‌లోనే మంజునాథ్‌ కమిషన్‌ గడువు ముగిసింది. ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో ప్రభుత్వం లేఖ పేరుతో డ్రామా మొదలు పెట్టిందని కాపు నాయకులు విమర్శిస్తున్నారు.



మరోవైపు ముద్రగడ పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించి, ఆంక్షలు విధించారు. ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా అమరావతిలోని సచివాలయంకు భద్రత పెంచారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, యాత్రలో ఎవరూ పాల్గొనరాదని డీజీపీ సాంబశివరావు అన్నారు. స్వలాభం కోసమే ముద్రగడ పాదయాత్ర తలపెట్టారని మంత్రి నారాయణ ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నం జరుగుతోందని, ముద్రగడ పాదయాత్రకు భయపడబోమని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top