అమరావతి టౌన్‌షిప్‌పై సర్కార్ కన్ను!

అమరావతి టౌన్‌షిప్‌పై సర్కార్ కన్ను! - Sakshi


విజయవాడ: విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా)కి చెందిన అతిపెద్ద ఆస్తి కొద్దిరోజుల్లో ప్రభుత్వపరం కానుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్మించటానికి అవసరమైన భూ ప్రతిపాదనల జాబితాలో దీన్ని చేర్చారు. ఉడాకు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద 162 ఏకరాల భూమి ఉంది. దీన్ని దాదాపు పాతికేళ్ల కిందట ఉడా రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ భూమి నిరుపయోగంగా ఉండటంతో దీనిపై ప్రభుత్వం దృష్టిపడింది.



ఈ భూమిని ఎయిమ్స్‌కుగానీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలకుగానీ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ల్యాండ్ బ్యాంక్ కొరత నేపథ్యంలో రూపొందించిన ప్రాజెక్టులన్నీ రికార్డులకే పరిమితమవుతున్న తరుణంలో ఉన్న కొద్ది భూమిని కూడా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుండటం ఉడాకు పెద్ద షాకే. ఉడా 1988-90 సంవత్సరాల్లో మంగళగిరి మండలంలోని నవులూరు వద్ద 390.38 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసింది.



2000 సంవత్సరంలో ఈ భూమిలోని కొంతభాగంలో అమరావతి టౌన్‌షిప్ పేరుతో 1,327 ప్లాట్లు వేశారు. వీటిలో అమ్ముడుపోని ప్లాట్లతో సహా అక్కడ ఉడాకు ప్రస్తుతం 162.81 ఎకరాల భూమి ఉంది. విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఇక్కడ ఎకరం భూమి విలువ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంది. ఈ క్రమంలో ఉడా మెుత్తం భూమి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది.



భూసేకరణ నేపథ్యంలో..

రాజధానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని కీలక విభాగాల దృష్టి ఉడా భూమిపై పడింది. ఈ భూమి విజయవాడకు సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో ఉండటం, దీనికి రెండు కిలోమీటర్ల దూరంలో మంగళగిరి పట్టణం ఉండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. మరోవైపు నూతన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం కొన్ని భూముల్ని ఎంపిక చేశారు.



ముఖ్యంగా విజయవాడ-గుంటూరు మధ్య 100 నుంచి 200 ఎకరాల భూమి ఉన్నది రెండుచోట్లే. ఈ క్రమంలో తొలుత దీన్ని ఎయిమ్స్‌కు కేటాయించాలని నిర్ణయించినా.. ఎయిమ్స్‌ను మంగళగిరిలో ఏర్పాటుచేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. 500 పడకల ఆస్పత్రి, పరిశోధనా స్థానం, ఇతర సౌకర్యాలు ఉన్న ఎయిమ్స్‌కు 100 నుంచి 200 ఎకరాల్లోపు భూమి సరిపోతుందని గతంలో ప్రకటించి మంగళగిరి సమీపంలో టీబీ శానిటోరియం భూమి 260 ఎకరాలను, అమరావతి టౌన్‌షిప్ భూమి 162 ఎకరాలను పరిశీలించారు.



టీబీ శానిటోరియం భూమిలో 50 ఎకరాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు, 75 ఎకరాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కేటాయించారు. శానిటోరియం భూమిలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, హెల్త్ యూనివర్సిటీలకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకుని వాటికి ఉడా భూములు ఇచ్చే అవకాశం ఉంది.



ఎయిమ్స్‌లో పరిశోధన స్థానం ఏర్పాటవుతుండటంతో హెల్త్ వర్సిటీకి ప్రత్యేకంగా భూమి ఇవ్వనవసరంలేదన్న వాదన ఉంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఏది మంజూరైనా తొలి ప్రాధాన్యత మాత్రం అమరావతి టౌన్‌షిప్‌కే ఇస్తున్నారు. ఉడా కొనుగోలు చేసిన భూమి కావటంతో దాని విలువకు సమానమైన భూమిని, లేదా ధరను చెల్లించే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top