ప్రతిపక్షమే టార్గెట్

ఆదివారం హైదరాబాద్ లో వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని అరెస్టు చేసి తరలిస్తున్న దృశ్యం - Sakshi


హత్యకేసు పక్కనపెట్టి.. అనంతర పరిణామాలపై దృష్టి

 కార్యాచరణ మొత్తం మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే..

 వైఎస్సార్‌సీపీ నేతలు గుర్నాథరెడ్డి, చందు విషయంలో ఇష్టారాజ్యం

 నోటీసు ఇచ్చే అవకాశమున్నా పట్టించుకోకుండా అరెస్టులు

 సీఆర్పీసీ నిబంధనల్ని పట్టించుకోని ‘అనంత’ పోలీసులు

 

 సాక్షి, హైదరాబాద్, అనంతపురం: రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని వెనుక ప్రముఖుల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని పట్టించుకోని పోలీసులు హత్యానంతరం చోటు చేసుకున్న విధ్వంసం కేసుకు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా హడావుడిగా అరెస్టులు చేపడుతున్నారు.

 

 అంశం ఏదైనా ప్రభుత్వానికి మాత్రం టార్గెట్ ప్రతిపక్షమే. శివప్రసాదరెడ్డి హత్యానంతరం చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన కేసులోనూ పోలీసుల ద్వారా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. అనంతపురం పోలీసులు ఆగమేఘాల మీద ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత  తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి అలియాస్ తోపుదుర్తి చందును అనంతపురంలో అరెస్టు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 సవరణని సైతం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. ఇదంతా మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివప్రసాదరెడ్డి హత్య కేసు దర్యాప్తులో చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని ప్రటించుకుంటున్న అధికారులు వైఎస్సార్ సీపీ నేతల విషయానికి వచ్చేసరికి వారినే టార్గెట్‌గా చేసుకుంటూ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారు. ఈ కోణంలో ఇప్పటికే 30 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని అరెస్టు చేసిన విషయం విదితమే.




 నిబంధనలకు తిలోదకాలిచ్చి:  పోలీసులు కేసుల నమోదు నుంచి అరెస్టుల వరకు ప్రతి అంశాన్నీ పోలీసు మాన్యువల్‌తో పాటు సీఆర్పీసీ నిర్దేశించిన ప్రకారం చేపట్టాలి. నిందితుల అరెస్టుకు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41కు జరిగిన కీలక సవరణ 2010, నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకా రం ఏడేళ్లు, అంతకంటే తక్కువ శిక్షపడే నేరాలకు సంబంధించి నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు తప్పనిసరి కాదు.

 

  శివప్రసాదరెడ్డి హత్యానంతరం రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి స్థానిక పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును (ఎఫ్‌ఐఆర్ నెం.57/2015) ఐపీసీలోని సెక్షన్లు 143, 427, 435, 436, 353, రెడ్ విత్ 149, ప్రజా ఆస్తుల భద్రత చట్టంలోని సెక్షన్లు 3, 4, క్రిమినల్ లా ఎమెండ్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 7 (1) కింద నమోదు చేశారు. వీటిలో 435, 436 మినహా మరే ఇతర సెక్షన్ కిందా ఏడేళ్ల శిక్ష పడే అవకాశం లేదు. తహసీల్దార్ కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రత్యక్షంగా పాల్గొనని గుర్నాథ్‌రెడ్డి, చందులకు కేవలం అక్రమంగా గుమిగూడటం (సెక్షన్ 143) మినహా మరే ఇతర సెక్షన్లు వర్తించవు. దీని ప్రకారం వీరికి తొలుత నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది.

 

 వీటికి స్పందించనప్పుడో, సదరు నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడని బలమైన ఆధారాలు ఉన్నప్పుడో, నేరానికి కొనసాగిస్తాడనే నిర్దిష్ట ఆరోపణలున్నపుడు మాత్రమే అరెస్టుకు అవకాశం ఉంది. ప్రజా జీవితంలో ఉండి, అరెస్టు సమయానికి హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉన్న గుర్నాథరెడ్డి, అనంతపురంలో అందుబాటులోనే ఉంటున్న చందు విషయంలో ఇవి ఏవీ వర్తించవని అధికారులకూ తెలిసిందే. అయినప్పటికీ ఈ విషయాలను పట్టించుకోని అనంతపురం పోలీసులు మంత్రి పరిటాల సునీత ఒత్తిడి మేరకే పని చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. విధ్వంసాలకు ప్రత్యక్షసాక్షులు కావడమే నేరమైతే ఆ సమయంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు, డీఎస్పీలు మల్లికార్జున వర్మ, విజయ్‌కుమార్‌తో పాటు వందలాది పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్రలో ఉన్నారు.

 

 ఫ్యాక్షన్ రంగు పులిమేందుకు..

 

 రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం చోటు చేసుకున్న శివప్రసాదరెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనుక స్థానిక మంత్రితో పాటు ఆమె కుమారుడు, పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. ఘటనకు ముందు, తదనంతరం జరిగిన పరిణామాలూ వీటికే బలాన్నిస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చారు.

 

 సూత్రధారిగా ఆరోపిస్తూ తోట శ్రీనివాసులుతో పాటు సహా మరో ముగ్గురిని గురువారం అరెస్టు ప్రకటించారు. వీరిని రాప్తాడు ఎస్సై ఘటన జరిగిన వెంటనే పట్టుకున్నారని సాక్షాత్తు ఎస్పీనే ప్రకటించి చట్ట ప్రకారం 24 గంటల్లోనే అరెస్టు ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి సంచలనాత్మక కేసుల్లో నిందితులు ఘటనాస్థలిలోనే దొరికినా పోలీసులు వెంటనే అరెస్టు ప్రకటించరు. ‘సాంకేతిక కారణాల’ నేపథ్యం లో కనీసం 48 గంటల పాటు వివిధ కోణాల్లో విచారించిన తరవాతే తదుపరి చర్యలు తీసుకుంటారు. శివప్రసాదరెడ్డి హత్య విషయంలో దీనికి భిన్నంగా వ్యవహరించిన అనంతపురం పోలీసులు తక్షణం అరెస్టు ప్రకటించడంతో పాటు కుట్రతో కూడిన ఈ నేరానికి 2003 నాటి ‘ట్రిపుల్ మర్డర్‌కు ప్రతీకారం’ అంటూ ఫ్యాక్షన్ రంగు పులిమారు.


 


ఈ కేసుకు సంబంధించిన పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుండా ‘టార్గెట్ ప్రతిపక్షం’ ఆపరేషన్ ప్రారంభించారు.

 

 హోం మంత్రితో భేటీ తర్వాత మారిన సీన్

 

 ప్రసాదరెడ్డి హత్యలో మంత్రి పరిటాల సునీత పాత్ర కూడా ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు మొదట్నుంచి ఆరోపిస్తున్నారు. హత్యకు బాధ్యుల్ని చేస్తూ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌లను వీఆర్‌కు పంపుతూ డీఐజీ బాలకృష్ణ  శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిం చిన మంత్రి పరిటాల సునీత హోం మం త్రి నిమ్మకాయల చినరాజప్పతో శని వారం భేటీ అయ్యారు. ప్రసాదరెడ్డి హత్య, పోలీసులను వీఆర్‌కు పంపడం, వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుపై భేటీలో చర్చించి, హోంమంత్రి ద్వారా పోలీసులపై సునీత ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సునీత, హోంమంత్రితో భేటీ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయి ‘అనంత’ పోలీసుల్లో వేగం పుంజుకుంది. సంచలనం సృష్టించిన హత్య కేసును పక్కన పెట్టి మరీ ఆగమేఘాల మీద విధ్వంసం కేసుకు ప్రాధాన్యం ఇస్తూ అరెస్టు చేస్తున్నారని తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top