మళ్లీ భూములు ‘ఔట్’!

రాజధాని చుట్టూ ప్రతిపాదిత అవుటర్ రింగ్ రోడ్డు ఊహా చిత్రం - Sakshi


రాజధాని చుట్టూ 180 కి.మీ. ఔటర్ రింగు రోడ్డుకూ భూ సమీకరణే

నిధులు కేంద్రానివి.. భూములు రైతులవి.. అభివృద్ధి చేసే కన్సల్టెంట్‌కు వాటా


 

 సాక్షి విజయవాడ బ్యూరో: రాజధాని జోన్ కోసం తొలి విడతలో 29 గ్రామాల్లో 30 వేల ఎకరాల వ్యవసాయ భూములను సేకరించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం రాజధాని చుట్టూ నిర్మించబోయే 180 కిలోమీటర్ల పొడవైన అవుటర్ రింగ్ రోడ్డుకూ ఇదే మంత్రం ప్రయోగించాలని నిర్ణయించింది. దాదాపు రూ.19 వేల కోట్ల ఖర్చయ్యే ఈ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేంద్రం, భూమి సేకరించే బాధ్యతను మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది.

 

 కన్సల్టెంట్ కంపెనీకి వెయ్యి ఎకరాల చొప్పున వాటా!

 ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని చుట్టూ  180 కిలోమీటర్ల  పొడవున అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు సిద్ధం చేయించింది. ఎనిమిది వరుసల రోడ్డుతో పాటు, రెండు సర్వీసు రోడ్లు, కృష్ణానది మీదుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన ఒక బ్రిడ్జి నిర్మించడానికి సుమారు రూ.19 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 4 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంటుందని నివేదికలో పొందుపరచారు. ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎన్ హెచ్ డీపీ - 7) కింద అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

 

 భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఎన్ హెచ్‌డీపీ ప్రాజెక్టుకు అప్పగించాలని షరతు విధించింది. ఈ మేరకు ప్రాజెక్టు  చీఫ్ ఇంజినీర్  రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు. భూ సేకరణ భారం కేంద్రంపై మోపాలని భావించిన రాష్ట్ర సర్కారుకు ఈ షరతు కొంత ఆందోళన కలిగించినట్లు సమాచారం. అవుటర్ రింగ్ రోడ్డు కోసం 4 వేల ఎకరాలకు పైగా భూ సేకరణ చేయాలంటే ఎకరానికి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి దాకా పరిహారం చెల్లించినా సరాసరి రూ. 3 వేల కోట్ల నుంచి రూ.మూడున్నర వేల కోట్లు  ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాజధాని జోన్ కోసం ఎలాగూ రైతుల భూములు సమీకరిస్తున్నందువల్ల అవుటర్ రింగ్ రోడ్డుకు అవసరమయ్యే 4 వేల ఎకరాలకు పైగా భూమిని కూడా ఇదే విధానంలో సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.

 

 ఇక్కడ కూడా రైతుల నుంచి 8 వేల ఎకరాల భూమి సేకరించి రోడ్డు నిర్మాణానికి 4 వేల ఎకరాలు పోతే, రైతులకు 3 వేల ఎకరాలు, భూమి అభివృద్ధి చేసి ఇచ్చే కన్సల్టెంట్ కంపెనీకి వెయ్యి ఎకరాల చొప్పున వాటాలు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధమై కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నాకే భూ సమీకరణ వాటాల విషయం ఖరారవుతాయని జాతీయ రహదారుల శాఖకు చెందిన అధికారి ఒకరు అభిప్రాయ పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top