రాజ్యసభ సభలో అడుగుపెట్టడమనేది చిరకాల కోరిక : యనమల

రాజ్యసభ సభలో అడుగుపెట్టడమనేది చిరకాల కోరిక : యనమల - Sakshi


 రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సుమారు రెండు నెలలు గడువుంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌లో ఈ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ‘పెద్దల సభ’లో సీటు దక్కించుకునేందుకు టీడీపీలోని జిల్లా పెద్దల మధ్య పెద్ద పంచాయతీయే నడుస్తోంది. గతంలో రాజ్యసభ అంటే జిల్లాలో ఒక్క యనమల పేరు మాత్రమే వినిపించేది. ఈసారి దీనికి భిన్నంగా రెండు మూడు పేర్లు పరిశీలనకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇది పార్టీలో ప్రత్యామ్నాయ ఆలోచనకు తెరతీయడమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

 

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :మూడు దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్న రాష్ర్ట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి పెద్దల సభలో అడుగుపెట్టడమనేది చిరకాల కోరిక. అసెంబ్లీ స్పీకర్, పీఏసీ చైర్మన్, ఆర్థిక మంత్రి.. ఇలా అనేక కీలక పదవులు అధిష్టించిన ఆయన గత ఎన్నికల్లో తునిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తరువాత రాజ్యసభకు వెళ్లాలనుకున్న ఆయనను తెలుగుదేశం పార్టీ అధిష్టానం శాసన మండలికి పంపించింది. దీంతో యనమల కొంత నిరుత్సాహానికి గురయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో ఆర్థిక మంత్రి అయ్యారు. అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను నంబర్-2గా ఉన్న రామకృష్ణుడు ఈసారైనా పెద్దల సభకు వెళ్లాలని ఆశిస్తున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు.

 

 గతంలో ఒకసారి వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు చుట్టూ ఉన్న కార్పొరేట్ కోటరీ ఎగరేసుకుపోయింది. ప్రస్తుతం పార్టీలోను, ప్రభుత్వంలోను అధినేత చంద్రబాబునాయుడి విధాన నిర్ణయాల వెనుక ఆయన కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చంద్రబాబు సామాజికవర్గ నేతలు యనమలపై ఇటీవల గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. అన్నింటా ఆయనకు ప్రాధాన్యం పెరుగుతూండడాన్ని కార్పొరేట్ కోటరీ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో పెద్దల సభకు వెళ్లేందుకు యనమలకు అవకాశం దక్కకుండా వారు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

 

 వారసుడిపై ఆరోపణలే ప్రత్యర్థుల అస్త్రాలు

 మంత్రి యనమల అవకాశాలను అడ్డుకునేందుకు తునిలో ఆయన రాజకీయ వారసుడైన కృష్ణుడిపై వస్తున్న ఆరోపణలనే కార్పొరేట్ కోటరీ అస్త్రాలుగా చేసుకుంటున్నట్టు సమాచారం. కాకినాడ సెజ్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌లలో భూ వివాదాలు, గిట్టనివారిపై భౌతిక దాడులు, పలు శాఖల్లో ఉన్నతోద్యోగుల బదిలీలు తదితర అంశాల్లో కృష్ణుడి ప్రమేయంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ కోసం యనమల చేస్తున్న యత్నాలకు గండి కొట్టాలని కార్పొరేట్ కోటరీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల నివేదికలను కూడా దీనికి జత చేశారని చెబుతున్నారు. వారు పైచేయి సాధిస్తే కృష్ణుడి వ్యవహార శైలి కారణంగా యనమల ఆశలకు గండి పడే అవకాశముంది.

 

 రేసులో పలువురు

 మరోపక్క రాజ్యసభ రేసులో ఈసారి ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులతో పాటు, ‘పశ్చిమ’ నుంచి సీతారామలక్ష్మికి రాజ్యసభ సభ్యత్వం ఒకే సామాజికవర్గానికి దక్కాయి. దీంతో మళ్లీ అదే సామాజికవర్గానికి చెందిన మెట్ల, చిక్కాల పేర్లు ఎలా పరిశీలిస్తారన్న వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల సందర్భంగా తాడేపల్లిగూడెం ఎన్నికల ప్రచార సభలో రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది ఇంతవరకూ నెరవేరలేదు. ఈ పరిస్థితుల్లో ఆవిర్భావం నుంచీ పదవులతో సంబంధం లేకుండా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి సేవలందిస్తున్న సుబ్రహ్మణ్యం పేరును రాజ్యసభకు పరిశీలనలోకి తీసుకోవాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వివాదరహితుడు, నిజాయితీపరుడనే పేరున్న చిక్కాలకు కీలక పదవి దక్కే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అది రాజ్యసభ కాకుండా, రాష్ర్టస్థాయిలో నామినేటెడ్ పదవి ఇవ్వవచ్చని ఊహిస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వంపై ఇప్పుడు ఎవరు ఎన్ని లెక్కలేసినా.. కోట్లు కుమ్మరించే కార్పొరేట్ వర్గాలు చివర్లో దీనిని ఎగరేసుకుపోవడం ఖాయమని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ ముక్తాయిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top