ఏపీలో మే 8న ఎంసెట్


సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్  కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) పరీక్ష తేదీని రెండు రోజులు ముందుకు జరిపి మే 8న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ పరీక్ష తేదీని మే 10గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు డీఎస్సీ (టీచర్  రిక్రూట్‌మెంటు టెస్టు), కేసెట్ పరీక్షలు ఉండటంతో షెడ్యూల్‌ను రెండు రోజులు ముందుకు జరుపుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సచివాలయంలోని ఆయన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విన్నపాలతో పాటు పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం 250 కేంద్రాలు, మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం 125 కేంద్రాలుంటాయని, 17 రీజనల్ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 1.70 లక్షల ఇంజనీరింగ్ సీట్లు, 3,100 మెడికల్ సీట్లు ఉన్నాయని చెప్పారు. ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూకి అప్పగించామని, చైర్మన్‌గా ప్రభాకరరావు, కన్వీనర్‌గా సాయిబాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇతర సెట్ల తేదీల్లో మార్పు ఉండదన్నారు. పరీక్షలను ఆఫ్‌లైన్లో నిర్వహిస్తామని, ఆన్‌లైన్లోనూ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎంసెట్ మార్కులతో పాటు ఇంటర్మీడియెట్లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను నిర్ణయిస్తారన్నారు. ఈ ఏడాది వరకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. ఎంసెట్‌ను ఉంచాలా? రద్దుచేయాలా? తమిళనాడు తరహాలో ఇంజనీరింగ్ కాలేజీలు నేరుగా ప్రవేశాలు నిర్వహించాలా? అన్న అంశాలపై కమిటీ వేశామని తెలిపారు. కాగా,ఎంసెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. కన్వీనర్‌గా ఉన్న జేఎన్టీయూ (కాకినాడ) ప్రొఫెసర్ సాయిబాబు ఈ నోటిఫికేషన్ విడుదలచేయనున్నారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈసారి పాత సెలబస్‌తోనే ఎంసెట్ నిర్వహించనున్నారు.

 

 ఇదీ షెడ్యూల్..

 

 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం    మార్చి 6

 ఫైన్ లేకుండా చివరి గడువు    ఏప్రిల్ 11

 500 ఫైన్‌తో గడువు    ఏప్రిల్ 16

 1,000 ఫైన్‌తో గడువు    ఏప్రిల్ 22

 5వేల ఫైన్‌తో గడువు    మే 2

 10వేల ఫైన్‌తో గడువు    మే 6

 హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్    మే2-మే 6

 ఎంసెట్ పరీక్ష    మే 8

 

 ఇతర సెట్లు, వాటి తేదీలు

 సెట్‌పేరు    తేదీ    వర్సిటీ

 ఈసెట్    మే14    ఏయూ

 పీఈసెట్    మే14    ఏఎన్‌యూ

 ఐసెట్    మే16    జేఎన్టీయూఏ

 పీజీసెట్    మే25    ఎస్‌కేయూ

 ఎడ్‌సెట్    మే28    ఎస్‌వీయూ

 లాసెట్/పీజీలాసెట్    మే30    జేఎన్టీయూకే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top