డీఐజీ సారూ..దీనికేంచెబుతారు!

డీఐజీ సారూ..దీనికేంచెబుతారు! - Sakshi


అనంతపురం: రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌సీపీ నాయకుడు శివప్రసాద్‌రెడ్డి హత్య అనంతరం తన అనుచరులు ప్రభుత్వ ఆస్తులపై ధ్వంసం చేస్తుంటే వారిని అడ్డుకోనందునే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిని అరెస్ట్ చేశామని డీఐజీ బాలకృష్ణ నిన్న విలేకరుల సమావేశంలో తెలపడం వాస్తవ విరుద్ధంగా ఉంది. సంఘటన జరిగిన రోజు ఆందోళనకారులు తహశీల్దార్ కార్యాలయం, కార్యాలయ ఆవరణలోని ద్విచక్రవాహనాలపై దాడులు చేస్తుంటే స్వయంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అడ్డుకున్నట్లు అప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. గురునాథరెడ్డి ఆందోళనకారులను అడ్డుకుంటూ పక్కకు తోస్తున్నట్లు ఈ వీడియో ఫుటేజీలో కనిపిస్తున్నాయి.



పోలీసులు మాత్రం ఆయన తన అనుచరులను అడ్డుకోనందునే కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. పైగా తాము వీడియో రికార్డులు పరిశీలించామని అందులో గురునాథరెడ్డి, దాడి జరుగుతుంటే చూస్తూ నిలబడినట్లు స్పష్టంగా గుర్తించామని చెబుతున్నారు. మరి ఈ ఫుటేజీలకు పోలీసుల నుంచి ఏం సమాధానం వస్తుందో మరి. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని చూసిన అనంతరం రోడ్డు పక్కన చెట్టుకింద కూర్చున్నారని, అయినా ఆయనపైనా అక్రమంగా కేసు బనాయించారని ఆరోపిస్తున్నారు. మంత్రి సునీత సూచనల మేరకు ఈ కేసుల నమోదు చేశారనేది స్పష్టమవుతోందని పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ అక్రమ అరెస్టులపై డీజీపీ, ఐజీ, ఎస్పీకి నోటీసులు జారీ చేసి విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి మానవ హక్కుల కమిషన్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top