బాబూ.. జాబేదీ?

బాబూ.. జాబేదీ? - Sakshi


ముఖ్యమంత్రిని ప్రశ్నించిన రాజమహేంద్రవరం యువత  

పని చేయకుండా పైపైన తిరిగితే ఉద్యోగాలు రావంటూ సీఎం అసహనం




సాక్షి, రాజమహేంద్రవరం/రెడ్డిగూడెం (మైలవరం): ‘జాబు రావాలంటే.. బాబు రావాలి’అంటూ గత సాధారణ ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును.. ఆ హామీ సంగతేమైందని రాజమహేంద్రవరం యువత గట్టిగా నిలదీసింది. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో, కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామ సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కెనాల్‌ వద్ద సీఎం చంద్రబాబు గోదావరికి జల హారతి ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండవ దశ నిర్మాణ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు.



 ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో అర్బన్‌ ఎస్పీ, సీఐడీ, నగరపాలక సంస్థ కొత్త భవనాలను ప్రారంభించిన అనంతరం జలసిరిపై ప్రతిజ్ఞ చేయిస్తున్న సమయంలో ‘బాబూ... జాబు’అంటూ పెద్ద ఎత్తున యువతీ, యువకులు కేకలు వేశారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ఎదురు దాడికి దిగారు. ‘మీరు కష్టపడితే రాష్ట్రంలోనే కాదు, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాను. నేను ఒక్కడినే కష్టపడితే సరిపోదు. మీరూ కష్టపడాలి. ఊరికే పైపైన తిరిగితే ఉద్యోగాలు రావు’అంటూ అసహనం వ్యక్తం చేశారు. త్వరలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు.



వైద్యానికి అమెరికన్లూ అమరావతి రావాల్సిందే..

సాక్షి, అమరావతి: అమరావతి అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏఏఐఎంఎస్‌)ను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దాలని నిర్వాహకులను సీఎం చంద్రబాబు కోరారు. భవిష్యత్‌లో అత్యుత్తమ వైద్య సేవలు అమరావతిలో అందుబాటులోకి రానున్నాయని.. అమెరికన్లు కూడా వైద్యం కోసం అమరావతికి రావాల్సిందేనన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్మించనున్న ఏఏఐఎంఎస్‌ ఆస్పత్రికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని గురువారం విజయవాడలోని ఏ–1 కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి సీఎం రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top