21వ శతాబ్దపు రాజధాని

21వ శతాబ్దపు రాజధాని - Sakshi


జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్

రాజధాని నిర్మాణానికి గడువు చెప్పలేను

మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు

హరిత రాజధాని కోసం ప్లాన్ ఇచ్చాం: సింగపూర్ మంత్రి ఈశ్వరన్


 

 సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా, ఓ డైనమిక్ సిటీగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వరన్ సోమవారం మాస్టర్ ప్లాన్ (రెండో దశ) ను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియా తో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ నూతన రాజ ధాని అభివృద్ధిలో సింగపూర్ కన్సార్షియం భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ (కీలకమైన ప్రభుత్వ నిర్మాణాలు ఉండే ప్రాంతం)ను సింగపూర్ ప్రభుత్వం అందిస్తుందని, జూన్ 6న భూమిపూజ చేసి విజయదశమి నుంచి నిర్మాణ పనులు మొదలెడతామని తెలి పారు. ప్రధానితోపాటు సింగపూర్ ప్రభుత్వా న్ని రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆ హ్వానిస్తామని చెప్పారు.

 

 రాజధాని నిర్మాణం ఎ న్ని దశల్లో.. ఎంత కాలం పడుతుందో.. తాను నిర్ణీత గడువు చెప్పలేనన్నారు. పారదర్శకతకు, అవినీతి రహితానికి మారుపేరైన సింగపూర్‌కు తాము అదే విధంగా పారదర్శకంగా సాయమందిస్తామని చెప్పారు. మాస్టర్ డెవలపర్ ఎంపికకు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అవలంబిస్తామన్నారు. కేంద్రం నుంచి తాము ఆర్థిక సాయం తప్ప ఏ రకమైన సాయం కోరడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి రూ.వెయ్యి కోట్లు, రాజ ధాని నిర్మాణానికి రూ.500 కోట్లు ఇప్పటికే కేం ద్రం ప్రకటించిందన్నారు. వ్యతిరేక కథనాలు ఇవ్వకుండా తమకు సహకరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల నాటికి రాజ దాని నిర్మాణం కూడా టీడీపీ ఉపయోగించుకుంటుందా? అని మీడియా ప్రశ్నించగా... సీఎం అంగీకరించారు.

 

 

 హరిత రాజధాని కోసం ప్లాన్ : ఈశ్వరన్

 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే విధంగా హరిత రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్ తయారు చేశామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. రాజధాని నిర్మాణం నాలుగైదేళ్లలో పూర్తయ్యేది కాదని, దశాబ్దాలుగా రాజధాని ప్లాన్‌ను అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్ ఆధారంగానే ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేశామన్నారు. రాజధాని మా స్టర్ డెవలపర్ ఎంపికకు నిర్వహించే స్విస్ ఛా లెంజ్ విధానంలో పాల్గొనేందుకు సింగపూర్ కంపెనీలు సైతం ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు.

 

 సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ మాస్టర్ ప్లాన్‌కు ఒప్పందం

 ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ (ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) మాస్టర్ ప్లాన్‌కు ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల నడుమ ఒప్పందం కుదిరింది. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, సింగపూర్ కోపరేషన్ ఎంటర్‌ప్రైజెస్ కలిసి సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు ఏపీలో రెండు ప్రభుత్వాలు కలిసి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహించనున్నాయి. సింగపూర్ కోపరేషన్ ఎంటర్‌ప్రైజెస్ ఏపీలో మున్సిపల్ శాఖ అధికారులతో రెండు వర్క్‌షాపులు నిర్వహించి, ఎంపిక చేసిన మున్సిపల్, నగర పాలికల్లో ప్రాజెక్టును అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టు గడువు మూడు నెలల్లో పూర్తవుతుందని ఇరు ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

 

 సింగపూర్ కంపెనీ సేవలో బాబు

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కార్పొరేట్ కంపెనీ ప్రతినిధిని హిజ్ ఎక్సలెన్సీ అని సంబోధిస్తూ అతిథి మర్యాదలు చేయడం పలువురిని విస్మయపరిచింది. కేపిటల్ సిటీ ప్లాన్ అందజేయడానికి వస్తున్న సింగపూర్ మంత్రి ఎస్.ఈశ్వరన్ రాకకోసం చంద్రబాబు ఎల్ బ్లాక్‌లోని 8 ఫ్లోర్‌లోని తన చాంబర్ నుంచి కిందకు దిగొచ్చి దాదాపు పావుగంట పాటు పోర్టికోలో పడిగాపులు కాశారు. ఈశ్వరన్‌తోపాటు సింగపూర్‌కు చెందిన కార్పొరేట్ కంపెనీ సుర్బానా సీఈవో పాంగ్ ఈ యాన్ తదితరులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. మాస్టర్ ప్లాన్ అందుకున్న తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ... ఈశ్వరన్‌తో పాటు సుర్బానా కంపెనీ ప్రతినిధిని కూడా ‘హిజ్ ఎక్సలెన్సీ’ అని రాచమర్యాదలివ్వడం అధికారులను విస్మయపరిచింది. కార్యక్రమం అనంతరం వారందరికీ ప్రత్యేక జ్ఞాపికలు బహూకరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top