రూ.15,000కోట్లు

రూ.15,000కోట్లు - Sakshi


ఏపీ రాజధాని నుంచి హైదరాబాద్‌కు

8 లైన్ల రహదారి నిర్మించడానికయ్యే ఖర్చు ఇది.. శివరామకృష్ణన్ కమిటీ అంచనా

రాజధాని నిర్మాణంపై కేంద్ర కమిటీ - రాష్ట్ర కమిటీల అంచనాల్లో భారీ వ్యత్యాసాలు

ప్రభుత్వ భూములున్న చోటును రాజధానికి ఎంపిక చేయాలన్న శివరామకృష్ణన్ కమిటీ

భూసేకరణకు రూ. 20,000 కోట్లు వ్యయం అవుతుందన్న నారాయణ కమిటీ

విజయవాడ - గుంటూరు - తెనాలి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిర్ణయం

రింగ్ రోడ్డు కోసం రూ. 19,700 కోట్లు ఇవ్వాలని ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ




హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుంచి హైదరాబాద్‌కు 8 లైన్ల రహదారి నిర్మాణం కోసం రూ. 15,000 కోట్ల వ్యయం అవుతుందని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అంచనా వేసింది. అయితే రాజధాని ఎంపికకు అనువైన ప్రాంతం, నిర్మాణానికి అవసరమైన వనరులకు సంబంధించిన వ్యయంపై.. శివరామకృష్ణన్ కమిటీ అంచనాలకు, ఏపీ మునిసిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలో వ్యాపారవేత్తలతో నియమించిన కమిటీ అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు వ్యయంపై శివరామకృష్ణన్ కమిటీ ఎటువంటి అంచనాలూ రూపొందించలేదు. ప్రధానంగా ప్రభుత్వ భూములు, అంతరించిన అటవీ భూములు అందుబాటులో ఉన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసుకోవాలనే సూచన చేసింది. అయితే.. ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా రాజధాని నిర్మాణానికి ఏ రంగంలో ఎంత వ్యయం అవుతుందనే అంచనాలను రూపొందించిన నారాయణ కమిటీ మాత్రం భూసేకరణకు రూ. 20,000 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. రాజధాని నిర్మాణం కోసం ఏకంగా భూసేకరణకే ఇంత పెద్ద మొత్తంలో వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ కమిటీ అంచనా వేయడం పట్ల శివరామకృష్ణన్ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.



ఔటర్ రింగ్ రోడ్డుకు రూ. 19,700 కోట్లు...



ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేయనున్నట్లు చెప్తున్న ప్రాంతమైన విజయవాడ - గుంటూరు - తెనాలి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఐదున్నర లక్షల ఎకరాల భూమి ఉందని, అందులో నాలుగున్నర లక్షల ఎకరాల్లో రాజధాని నిర్మాణంతో పాటు వివిధ రంగాల అభివృద్ధికి వినియోగించాలని చంద్రబాబు ఆలోచనగా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రాధమికంగా రూ. 19,700 కోట్లు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ కూడా రాసారని అధికార వర్గాలు తెలిపాయి.

 రాజధాని పరిసరాల్లో ఒక్కో రంగం అభివృద్ధికి 15,000 ఎకరాలతో ప్లాట్లను విభజించనున్నారని, ఆ విధంగా పదిహేను రంగాలకు పదిహేను ప్లాట్లను కేటాయించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలోని వ్యాపారవేత్తలతో పాటు కొందరి ప్రయోజనాల కోసం ఈ ప్లాట్ల కేటాయింపు జరగనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.



http://img.sakshi.net/images/cms/2014-07/41406666744_Unknown.jpg

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top