నవ్యాంధ్ర రాజధాని అమరావతి

నవ్యాంధ్ర రాజధాని అమరావతి - Sakshi


* ఆంధ్రప్రదేశ్ రాజధానికి మంత్రివర్గం నామకరణం

రాజధాని పేరును అమరావతిగా నిర్ణయిస్తూ ఏపీ కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం

* నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదముద్ర

* అమరావతిని ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

* మూడు దశల్లో రాజధాని నగరాన్ని నిర్మిస్తాం

* కేపిటల్ రీజియన్ మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ ఇప్పటికే ఇచ్చింది

* కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ మే 15లోగా.. జూన్‌లోగా సీడ్ కేపిటల్ యాక్షన్ ప్లాన్

* పరిపాలనను రాజధాని నుంచి సాగించడానికి అక్కడ క్యాంప్ ఆఫీసు    


 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన అమరావతి పేరు పెట్టాలని రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్ది.. రాష్ట్రానికి పునర్‌వైభవం తెస్తామన్నారు. నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలో 2015 నుంచి 2020 వరకూ అమల్లో ఉండే ఈ పారిశ్రామిక విధానం దేశంలో అత్యుత్తమమైనదిగా ఆయన అభివర్ణించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రిమండలి బుధవారం సచివాలయంలో సమావేశమైంది.



రాజధాని నిర్మాణం, నూతన పారిశ్రామిక విధానంపై సుదీర్ఘంగా చర్చించింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను సమావేశానంతరం సీఎం చంద్రబాబు విలేకరులకు వెల్లడించారు. పురాణేతిహాసాల్లో దేవేంద్రుడి రాజధాని అమరావతిగా ఉండేదని.. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు, మౌర్యు లు, చోళులు, కాకతీయులు, విజయనగర చక్రవర్తులు అమరావతి, ధరణికోటను రాజధానిగా చేసుకుని.. ప్రజారంజకమైన పరిపాలనను అందించారని వివరించారు. పూర్వభాగాన కృష్ణానది ప్రవహిస్తుండటం వల్ల అమరావతి దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిందని, అమరేశ్వ రాలయం పంచారామాల్లో ఒకటని చెప్పారు. అద్భుతమైన వాస్తు ఉన్న రాజధానికి అమరావతి అన్నపేరు తోడైతే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని భావించే.. ఆ పేరు పెట్టాలని మంత్రివర్గం తీర్మానించిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడాలేని రీతిలో రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తామంటూ సింగపూర్ ప్రభుత్వం రాష్ట్రానికి బాసటగా నిలిచిందన్నారు.



 రాజధానిపై బాబు వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

* కేపిటల్ రీజియన్ మాస్టర్‌ప్లాన్‌లో రాజధాని ప్రాంతాన్ని 8 ప్రణాళిక విభాగాలుగా విభజించాం. ఒక్కోభాగాన్ని ఒక్కో గ్రోత్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తాం. రాజధాని చుట్టూ విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ 210 కి.మీ.ల మేర అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)ను నిర్మిస్తాం. గుడివాడ, నూజి వీడు, సత్తెనపల్లి, నందిగామలను ఓఆర్‌ఆర్‌కు కలుపుతూ 4 రేడియల్ రోడ్లను నిర్మిస్తాం.

2050 నాటివరకూ రాజధాని అవసరాలు తీర్చేలా గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తాం. మంగళగిరి ప్రాంతంలో భవిష్యత్‌లో విమానాశ్రయం నిర్మాణానికి ఐదువేల ఎకరాల భూమిని రిజర్వులో ఉంచుతాం.

మచిలీపట్నం ఓడరేవును లాజిస్టిక్ హబ్‌గానూ.. నిజాంపట్నం పోర్టును ఇండస్ట్రియల్ కారిడార్(వాన్‌పిక్)గా అభివృద్ధి చేస్తాం.

రాజధాని ప్రాంతంలో 8 రీజినల్ సెంటర్లను కలుపుతూ ప్రాంతీయ రహదారులు నిర్మిస్తాం. కృష్ణా నదిపై 5 ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మిస్తూ.. లింక్ రోడ్లను చేపడతాం.

* విజయవాడ రైల్వే జంక్షన్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి రైళ్లను మళ్లిస్తాం. ఇం దుకు కృష్ణానదిపై బ్రిడ్జిలు నిర్మించి.. నందిగామ-సత్తెనపల్లి, గుడివాడ-తెనాలి మధ్య కొత్త రైల్వేమార్గాలను వేస్తాం. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడతాం. రాజధానిని బెంగళూరుతో అనుసంధా నం చేసేలా హైస్పీడ్ రైలు టెర్మినల్‌ను ఏర్పాటుచేస్తాం. ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు సముద్రతీరాన్ని కలుపుతూ డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ ఏర్పాటుచేస్తాం.

 

కృష్ణానది ఉత్తర, దక్షిణ భాగాలను కలుపుతూ బకింగ్‌హామ్ కెనాల్ అంతర్గత జలమార్గాన్ని పునరుద్ధరిస్తాం. రాజమండ్రి-భద్రాచలం మధ్యన గోదావరినదిలో అంతర్గత జలమార్గాన్ని అభివృద్ధి చేస్తాం. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువకు మరో జలమార్గాన్ని ఏర్పాటుచేస్తాం.

 

 పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధి

* రోడ్డు, రైల్వే, వైమానిక, జల రవాణా మార్గాలు, నీళ్లు, విద్యుత్ అందుబాటులో ఉంటే పారిశ్రామిక ప్రగతి ఉరకలెత్తుతుంది. హా నందిగామను ఫార్మా, బయోటెక్, ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్ కారిడార్‌గా.. గుడివాడను గ్రీన్ ఇండస్ట్రీస్, వ్యవసాయాధారిత పరిశ్రమల కారిడార్‌గా.. గన్నవరాన్ని ఐటీ, ఐటీయూఎస్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ కారిడార్‌గా.. గుంటూరును ఫుడ్‌ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, నాన్‌మెటాలిక్ ప్రొడక్ట్స్ కారిడార్‌గా.. తెనాలిని లాజిస్టిక్స్, టూరిజం, ఎంటర్‌టైన్‌మెంట్ కారిడార్‌గా.. సత్తెనపల్లిని టూరిజం, నాలెడ్జి కారిడార్‌గా.. నూజివీడును ఆగ్రో-ఇండస్ట్రియల్, ఫ్యాబ్రికేషన్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తాం.

 

 మాస్టర్ డెవలపర్‌కోసం టెండర్లు..

* సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన కేపిటల్ రీజియన్ మాస్టర్‌ప్లాన్‌ను మంత్రిమండలి సూత్రప్రాయంగా ఆమోదించింది. ఈ మాస్టర్‌ప్లాన్ అమలుకు మాస్టర్ డెవలపర్‌కోసం టెండర్లు పిలుస్తాం. అంతర్జాతీయ సంస్థలను రాజధాని ప్రాంతానికి రప్పించి అభివృద్ధి చేసే బాధ్యతను మాస్టర్ డెవలపర్‌కు అప్పగిస్తాం.

* వీలైనంత తొందరగా పరిపాలనను రాజధాని ప్రాంతం నుంచి సాగించడానికే అక్కడ క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసుకుంటున్నా. వారంలో మూడు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ.. ఇప్పటికిప్పుడు పాలనాయంత్రాంగాన్ని అక్కడికి తరలించలేం. ఎందుకంటే 20 వేలమంది ఉద్యోగులకు అక్కడ వసతి కల్పించలేం.

 

 ఎంట్రీ ట్యాక్స్‌తో 2 రాష్ట్రాలకూ నష్టమే

 పునర్విభజన బిల్లులో పదేళ్లపాటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బిల్లులోని అంశాలను పరిగణనలోకి తీసుకోవట్లేదు. హిందుజా, కృష్ణపట్నం, సీలేరు విద్యుత్ పంపిణీ విషయాన్ని చర్చల ద్వారాగానీ.. పెద్దమనుషుల ద్వారాగానీ పరిష్కరించుకుందామని తెలంగాణ సర్కారుకు ప్రతిపాదించా. కానీ తెలంగాణ సీఎం అవేమీ పట్టించుకోవడం లేదు. విభజన చట్టానికి తూట్లు పొడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పన్ను విధించింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవులకు వచ్చే వాహనాలపై పన్ను విధిస్తే ఎవరికి నష్టం? ప్రవేశ పన్ను వల్ల రెండు రాష్ట్రాలకూ నష్టమే.

 పట్టిసీమపై విపక్షాల నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.

 

  వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టి ఉంటే.. ఈ పదేళ్లలో రాష్ట్రంలో కరువు వచ్చి ఉండేది కాదు. ఏదేమైనా పట్టిసీమను పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతున్నాం. 14వ ఆర్థిక సంఘం, కేంద్రం మాత్రం ప్రత్యేక హోదాకు.. ప్యాకేజీకి ఎలాంటి తేడా ఉండదని చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల స్థాయికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేవరకూ 90 శాతం నిధులను గ్రాంటుగానూ.. పది శాతం రుణంగా అందించాలని కోరుతున్నాం. 13వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం రూ.4,017.28 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ 1 నాటికి కేంద్రం రూ.3,774.29 కోట్లను విడుదల చేసింది. మరో రూ.242.99 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రత్యేక నిధుల కింద రూ.513.09 కోట్లకుగాను.. రూ.215.35 కోట్లను కేంద్రం విడుదల చేసినందుకు ధన్యవాదాలు.

 

మూడు దశల్లో రాజధాని నిర్మాణం

 రాజధానిని మూడు దశల్లో నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇందుకు కేపిటల్ రీజియన్ మాస్టర్‌ప్లాన్, కేపిటల్ సిటీ మాస్టర్‌ప్లాన్, సీడ్ కేపిటల్ యాక్షన్‌ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. అందులో భాగంగా కేపిటల్ రీజియన్ మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్ బృందం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు. కేపిటల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను మే 15లోగా.. సీడ్ కేపిటల్ యాక్షన్‌ప్లాన్‌ను జూన్‌లోగా అందిస్తామని సింగపూర్ ప్రభుత్వం హామీఇచ్చిందన్నారు. రాజధాని ప్రాంత ప్రస్తుత జనాభా 5.8 మిలియన్లని, 2035 నాటికి 11 మిలియన్లు, 2050 నాటికి 20 మిలియన్లకు పెరిగే అవకాశముందని చంద్రబాబు చెప్పారు.

 

రాజధాని పేరు అమరావతి: ఏపీ మంత్రి మండలి తీర్మానం

 ‘మన ప్రజా రాజధాని ఆధునిక పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. 21వ శతాబ్దంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలను అనుసరించడమే కాకుండా రాబోయే శత సహస్ర శతాబ్దాల్లో కూడా నిత్యనూతనంగా వెలుగొందే విధంగా రూపుదిద్దుకోవాలి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఘనచరిత్రను, విజయగాథను, శాస్త్ర, సాంకేతికరంగాల్లో సాధించిన కీర్తిని, తాత్విక చింతనలో కనబరచిన గాఢతను ప్రతిబింబింపచేయాలన్నదే మా మంత్రివర్గ ఆకాంక్ష. ఈ విశాలమైన ఆకాంక్ష దృష్ట్యా మన రాజధానికి ‘అమరావతి’ అనే పేరు అన్ని విధాలా సరైనదని మంత్రివర్గం అభిప్రాయపడుతోంది.

 

 అమరావతి అంటే అజరామరమైన నగరం. మన పురాణేతిహాసాల్లో దేవేంద్రుని రాజధానిగా అభివర్ణింపబడిన నగరం. క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం. శ్రీముఖ శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు 4 శతాబ్దాలు అప్రతిహతంగా గాంధారం నుంచి కృష్ణాతీరం వరకు విస్తరించిన సామ్రాజ్యానికి రాజధాని నగరం. గౌతమ బుద్ధుని పాదస్పర్శతో పునీతమైన నగరం. ఆచార్య నాగార్జునుని వంటి అనేకమంది పండితుల తాత్విక శాస్త్ర చర్చోపచర్చలతో మార్మోగిన నగరం. సనాతన, బౌద్ధ ధర్మాలు రెండింటికీ సమానంగా ఆలవాలమై విలసిల్లిన నగరం. మన ప్రజల గత వైభవాన్ని చాటి చెప్పే అమరావతి నామాన్ని మన నూతన రాజధానికి పెట్టుకుని చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ అత్యంత అధునాతన ప్రజా రాజధాని నగరంగా తీర్చిదిద్దుకోవాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.’ ఏపీ మంత్రి మండలి సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు, పలువురు మంత్రివర్గ సహచరుల సమక్షంలో ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ఈ తీర్మానాన్ని మీడియాకు చదివి వినిపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top