నేడు కేబినేట్ భేటీపై ఉత్కంఠ


సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం, విద్యుత్ టారిఫ్ ఖరారు, బీపీఎస్, రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఎంసెట్ నిర్వహణ వంటి కీలకమైన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక అంశాలపై సోమవారం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశం చర్చించే అవకాశాలున్నాయి.



ఎంసెట్‌ను తామే నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో విడిగా ఎంసెట్ నిర్వహించాలా.. లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా.. అని తర్జనభర్జన పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి రానుంది. అలాగే విద్యుత్ ఏఆర్‌ఆర్‌ను ఈఆర్‌సీకి సమర్పించినప్పటికీ దాదాపు ఏడువేల కోట్ల రూపాయల మేరకు ఉన్న లోటును భర్తీ చేసుకోవడానికి టారిఫ్‌ను సమర్పించాల్సి ఉంది. ఆ టారిఫ్‌పైన కూడా నేటి మంత్రివర్గ సమావేశం చర్చించనుంది.



ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ విషయాన్ని ఈ భేటీలో చర్చిస్తారా, లేక మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపుతోందన్న కారణంతో వాయిదా వేస్తారా అన్నది తేలనుంది. పీఆర్సీ జాప్యంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు, జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆందోళన కోసం కార్యాచరణ రూపొందించాలన్న దిశగా ఆలోచిస్తున్నాయి. మరోవైపు కొంతమేరకైనా చార్జీల వడ్డన తప్పదని డిస్కంలు చెబుతున్న నేపథ్యంలో కరెంట్ చార్జీల పెంపుపై కేబినేట్ ఎలాంటి నిర్ణయానికొస్తుందో నేడు తేలిపోనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top