మంత్రి పదవికి లోకేశ్‌ ఒత్తిడి ఉగాదికి ముహూర్తం!

మంత్రి పదవికి లోకేశ్‌ ఒత్తిడి ఉగాదికి ముహూర్తం! - Sakshi


మంత్రివర్గంలో మార్పులు చేర్పులు



మృణాళిని, పల్లె, రావెల, పీతల, పత్తిపాటి, నారాయణలకు ఉద్వాసన

నారాయణకు సీఆర్‌డీఏ చైర్మన్‌ పదవి... లోకేశ్‌కు మున్సిపల్, ఐటీ శాఖలు

కళా వెంకట్రావు, అఖిలప్రియ, అమర్‌నాథ్‌రెడ్డి, మాగుంట,

 మహ్మద్‌ జానీ, గొల్లపల్లి, సుజయకృష్ణకు పదవులు!



సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం తో మంత్రివర్గంలో వెంటనే చేరిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 19న మంచి ముహుర్తమని, ఆరోజు మంత్రివర్గం లో మార్పులు చేర్పులు చేపట్టాలని తండ్రిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 19వ తేదీన లోకేశ్‌ నక్షత్రబలం బాగుందని, అదే రోజు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబంలో తీవ్ర తర్జనభర్జనలు సాగాయని, 19వ తేదీన మంత్రివర్గంలో మార్పులు చేయకపోతే తదుపరి తేదీని ఇప్పుడే చెప్పాలంటూ లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు పట్టు పట్టారని సమాచారం.



అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత ఉగాది రోజు కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేపడతా నని, ఉగాది మంచి రోజుని చంద్రబాబు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపడితే ఎన్నికల్లో ఏదైనా జరిగితే అసలుకే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన నచ్చజెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంటే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన మరుసటి రోజునే లోకేశ్‌కు మంత్రి పదవి ఇచ్చి పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీకి చెందిన అత్యున్నత వర్గాలు తెలిపాయి. లోకేశ్‌కు మున్సిపల్‌–పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలను ఇవ్వనున్నారు. ప్రస్తుతం మున్సిపల్‌ శాఖ నిర్వహిస్తున్న  నారాయణను మంత్రివర్గం నుంచి తప్పించి, సీఆర్‌డీఏ చైర్మన్‌ పదవిని ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.



ఏడుగురికి ఉద్వాసన...

కేబినెట్‌లో భారీగా మార్పులు, చేర్పులు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న వారిలో ఆరుగురు లేదా ఏడుగురికి ఉద్వాసన పలకనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మృణాళినికి ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారని, ఆయనపై కూడా కత్తి వేలాడుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.



 సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి తప్పించనున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెల కిషోర్‌బాబు, గనులు శాఖ మంత్రి పీతల సుజాత, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కొత్తగా మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన మహ్మద్‌ జానీకి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.



మంత్రివర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు!

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆశ చూపడమే కాకుండా కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను మంత్రివర్గం లోకి తీసుకోవడంపై తర్జనభర్జన పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, సుజయ రంగారావులకు కూడా మంత్రి పదవులు దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటు న్నాయి. అయితే వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పటికే పార్టీ అధినేతకు అల్టిమేటమ్‌లు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top