బాపుకు ఏపీ అసెంబ్లీ ఘన నివాళి

బాపుకు ఏపీ అసెంబ్లీ ఘన నివాళి - Sakshi


సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, వ్యంగ్య చిత్రకారుడు బాపుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఘనంగా నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. బాపు కీర్తిప్రతిష్టలు చిరకాలం నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శాసన సభ్యులు బాపు ప్రతిభాపాటవాలు, సేవలను కొనియాడారు. విజయవాడలోని కోస్టల్ మ్యూజియంకు బాపు పేరు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త రాజధానిలో ప్రపంచస్థాయి నిర్మాణం చేసి దానికి బాపు రమణ కళాక్షేత్రంగా నామకరణం చేస్తామని చెప్పారు. పుష్కరాలలోగా గోదావరి తీరాన బాపు, రమణల విగ్రహాలను ప్రతిష్టిస్తామని చెప్పారు.

 

 మరణం లేని మహామనిషి: జగన్

 

 బాపు మరణం లేని మహా మనిషి అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీర్తించారు. తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వ్యక్తి అని చెప్పారు. బాపు సినీ లోకానికే కాకుండా యావత్ జాతికే గర్వకారణమని అన్నారు. ఆయన గీత, రాత తెలుగు సంస్కృతిలో భాగమయ్యాయని చెప్పారు. ఆయన దస్తూరి మీద ఏకంగా ఫాంటే వచ్చిందంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు అండదండలివ్వాలని అన్నారు. బాపు లేరన్న విషయం బాధ కలిగించిందని, సినీ రంగానికే కాక యావత్ తెలుగుజాతే ఓ ఆణిముత్యాన్ని కోల్పోయిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు.

 

 కోటప్పకొండ స్థల పురాణంపై బాపు కార్టూన్లు: కోడెల

 

 స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ బాపుతో తనకున్న పరిచయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తన నియోజకవర్గంలోని కోటప్పకొండ స్థల పురాణాన్ని తెలిపేలా బాపుతో చిత్రాలను వేయించినట్టు తెలిపారు. నవరసాలు పలికేలా 9 చిత్రాలు గీశారని వివరించారు.

 

 బాపుకు మండలి నివాళి

 

 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కూడా సోమవారం బాపుకు నివాళులర్పించింది. బాపు తెలుగుజాతి గర్వించదగ్గ గొప్ప చిత్రకారుడని, గీత బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నారని మండలి చైర్మన్ చక్రపాణి  అన్నారు. తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారని అన్నారు. బాపు మృతికి సంతాప సూచకంగా శాసనమండలి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 

 ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలి: చిరంజీవి

 

 చెన్నై, సాక్షి ప్రతినిధి: భౌతిక ప్రపంచాన్ని వీడిపోయిన బాపు కళా నైపుణ్యాన్ని భావితరాల వారికి అందించేలా ప్రభుత్వం ఒక ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కోరారు. ఆయన సోమవారం తన సతీమణి సురేఖతో కలిసి చెన్నైలో బాపు పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. బాపు మరణాన్ని తను జీర్ణించుకోలేక పోతున్నారు.




 అందరి గుండెల్లో పదిలం: బాలకృష్ణ




 తెలుగుజాతి ఉన్నంత కాలం.. తెలుగు వారి గుండెల్లో బాపు పదిలంగా జీవించే ఉంటారని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కీర్తించారు. చెన్నైలో సోమవారం బాపు భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీ తెలుగువారి లోగిలిలో బాపు కొలువై ఉన్నారన్నారు. ఆయన లేని లోటు తెలుగు జాతికి తీరనిదన్నారు.

 

 బాలు ఆవేదన

 

 తన కుమారుడు చరణ్, బాపు పెద్దకుమారుడు వేణుగోపాల్ సంయుక్తంగా బాపు దర్శకత్వంలో ఆంజనేయస్వామిపై తీయదలుచుకున్న యానిమేషన్ చిత్రం కార్యరూపం దాల్చకుండానే బాపు కాలం చెందారని సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన తన కుమారుడు ఎస్.పి.చరణ్‌తో కలిసి నివాళులర్పించారు.

 

 బాపు వుృతికి సురవరం సంతాపం

 

 గొప్ప చిత్రాలను నిర్మించిన దర్శకుడు, అద్భుతమైన కార్టూనిస్ట్, తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన బాపు మృతి పట్ల సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. బాపు లేని లోటు తెలుగు సినిమా,సాహిత్యరంగాలకు పూడ్చలేనిదని చెప్పారు. ఆయన చిత్ర రంగంతోపాటు పలు రంగాలను ప్రభావితం చేశారన్నారు. గొప్ప మానవతావాదని కొనియాడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top