కలాంకు అసెంబ్లీ నివాళి


మాజీ రాష్ట్రపతి సేవల్ని కొనియాడిన సభ

 సాక్షి, హైదరాబాద్: ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఏపీ రాష్ట్ర శాసనసభ ఘన నివాళులర్పించింది. దేశానికి ఆయన అందించిన సేవల్ని కొనియాడింది. యుగపురుషుడని, ఆదర్శప్రాయుడుగా ఎన్నదగిన మహనీయుడని కీర్తించింది. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం స్పీకర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కలాం అనునిత్యం స్మరించదగిన వ్యక్తని అన్నారు.  కలాం స్మారకార్థం ఒంగోలులోని ట్రిపుల్ ఐటీకి ఆయన పేరును పెడతామని చెప్పారు. విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలను ఆయన పేరిట ఇస్తామని, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

 యుగానికొక్కరు...: వైఎస్ జగన్

 అబ్దుల్ కలాం లాంటి వారు యుగానికొక్కరే ఉంటారని, ఆయన మృతి తీవ్రంగా కలచి వేసిందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కోట్లాది మందికి ఆయన ఆరాధ్యుడు, ఆత్మీయుడన్నారు. ఆయనకు తమ పార్టీ తరఫున, తన తరఫునా నివాళులు అర్పిస్తున్నామన్నారు. పలువురు సభ్యులు మాట్లాడిన  అనంతరం స్పీకర్ కోడెల తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటిస్తూ కలాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.




 శాసనమండలిలోనూ....: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు శాసనమండలిలోనూ ఘనంగా నివాళులు అర్పించారు.  ప్రభుత్వం తరుఫున వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మండలిలో ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లులతో పాటు పీజే చంద్రశేఖర్(సీపీఐ), సోమువీర్రాజు (బీజేపీ), బాలసుబ్రమణ్యం (పీడీఎఫ్)లు తీర్మానానికి మద్దతు పలికి కలాం సేవలను కొనియాడారు. పుష్కర మృతులకు మండలి సంతాపం తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ ఆత్మహత్య చేసుకున్న వారికి సంతాప తీర్మానాన్ని మంత్రి శిద్దా రాఘవరావు ప్రవేశపెట్టి ఆమోదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top