నేటి నుంచి ఏపీలో అసెంబ్లీ సిబ్బంది విధులు

నేటి నుంచి ఏపీలో అసెంబ్లీ సిబ్బంది విధులు - Sakshi


మార్చి 2న అధికారిక ప్రారంభోత్సవం...



అమరావతి : వెలగపూడిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో సోమవారం ఉదయం 11.30 గంటల నుండి అధికారికంగా సిబ్బంది కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుండి వస్తున్న శాసనసభ సిబ్బందికి స్పీకర్‌ డా. కోడెల శివప్రసాదరావు స్వయంగా స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుండి వీడ్కోలు తీసుకున్న సభాపతి కోడెల సోమవారం నుంచి పూర్తి స్థాయి బాధ్యతలను వెలగపూడి నుండి నిర్వహిస్తారని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావు తెలిపారు.

 

ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం అధికారిక  ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మార్చి రెండోతేదీన ఉదయం 11:25 గంటలకు ముఖ్య‌మంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి తక్కువ సమయం ఉండడంతో శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు కూడా నూతన అసెంబ్లీ భవనం నుండి తన విధులను నిర్వహిస్తున్నారు. దీంతో వెలగపూడిలో సందడి వాతావరణం నెలకొంది. స్పీకర్‌ కోడెల ఛాంబర్ల కేటాయింపుపై అధికారులతో చర్చిస్తారు.



ఇప్పటికే హైదరాబాద్ శాసనసభ నుండి ఏపీకి సంబంధించిన సామాగ్రిని తరలించగా, సిబ్బందికి అవసరమైన తాత్కాలిక వసతి ఏర్పాట్లను శాసనసభ కార్యదర్శి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మార్చి 6వ తేదీ నుండి సొంతగడ్డపై తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన సిబ్బందిని బడ్జెట్ సమావేశాల అనంతరం రిలీవ్ చేయాలని సత్యనారాయణరావు నిర్ణయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top