మాఫీ దక్కేనా?


నెల్లూరు(అగ్రికల్చర్): రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణమాఫీ ఒక ప్రహసనంగా మారింది. ఈ పథకంలో అర్హులను తేల్చేందుకు రాష్ట్రప్రభుత్వం సవాలక్ష ఆంక్షలతో వడపోత పట్టి లక్షలాదిమంది రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రుణమాఫీ అర్హుల, అనర్హుల జాబితాలను విడుదల చేసి ఈ నెల 31లోపు ఫిర్యాదు చేసుకోవాలని సూచించింది. అర్హుల జాబితాలో తప్పుల సవరణ గడువు శనివారంతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా రైతు రుణమాఫీ అర్హత కోసం అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం పెట్టిన పరీక్షలో జిల్లాలో 3 లక్షల మం ది అనర్హులుగా తేలారు. సవరణలకు శని వారం చివరి రోజు కావడంతో రైతులు ఇం టర్‌నెట్ సెంటర్లకు, తహశీల్దార్ కార్యాల యాలకు క్యూ కట్టారు. జిల్లాలోని తహశీ ల్దార్ కార్యాలయాలు రైతులతో కిక్కిరిశాయి.

 

 రకరకాల కొర్రీలతో..


 జిల్లాలో 5,93,906 మంది రైతులు గతేడాది రబీ, ఖరీప్ సీజన్లల్లో రూ.3,093.02 కోట్లు పంట రుణాలు బ్యాంకుల నుంచి తీసుకున్నారు. జిల్లా నుంచి 5,04,611 మంది రైతులు రుణమాఫీకి అర్హులను బ్యాంక్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. రుణమాఫీ జాబితాను కుదించేందుకు బాబు సర్కార్ రకారకాల షరతులు, రోజుకో జీవో, విధానాలను రూపొందించింది. చివరకు 1,84,955 మంది రైతులు రుణమాఫీకి అర్హులంటూ తొలి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 1,84,731 మంది కూడా రుణమాఫీకి అర్హులంటూనే వీరు సరైన వివరాలను గ్రామ జన్మభూమి కమిటీల ద్వారా బ్యాంకర్లకు అందజేయాలని ఆదేశించింది. 1,34,925 మంది రుణమాఫీకి పూర్తిగా అనర్హులంటూ ప్రకటించింది.

 

అర్హుల, అనర్హుల జాబితాలోని తప్పులను సవరించేందుకు జనవరి 31వ తేదీగా చివరి గడువుగా నిర్ణయించింది. ఇప్పటివరకు జిల్లాలో 45,538 ఫిర్యాదులు రాగా, 22, 221 మంది ఫిర్యాదులను పరిష్కరించి రుణమాఫీకి అర్హులని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. 8,457 మంది ఫిర్యాదులు తిరస్కరించగా, 13,860 మంది ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టినట్లు అధికారులు తెలిపారు. తొలిజాబితాలో అర్హులుగా ప్రకటించిన వారి ఖాతాల్లో పూర్తిస్థాయిలో రుణమాఫీ  సొమ్ము జమకాలేదు. ఎన్నికల హామీ ప్రకారం ఒకేసారి రుణాలను మాఫీ చేసి రైతులకు భారం తగ్గించాల్సిన బాబు మాఫీ కథను ఐదేళ్లకు పొడిగించారు. అంతే కాదు ఐదేళ్లపాటు ఏడాదికి కొంత చొప్పున రైతు సాధికారిక సంస్థ చెల్లిస్తుందని మెలిక పెట్టారు. లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకు సవాలక్ష ఆంక్షలను పెట్టారు.

 

 జాబితా కుదింపే లక్ష్యం...


 రుణమాఫీకి బ్యాంకర్లు సిద్ధం చేసిన రైతుల జాబితాలు కంప్యూటర్‌లో సక్రమంగా అప్‌లోడ్ కావడం లేదని, ఆధార్‌కార్డుల పేర్లు, ఇతర వివరాలకు సంబంధించి చిన్న అక్షరం తేడా ఉన్నా ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదని, లోపాలను సరిచేసి మళ్లీ పంపాలని తొలుత బ్యాంకర్లకు సూచించారు. గులాబీ కార్డు కలిగిన రైతు పేరు పక్కన ఆధార్‌కార్డు వెరిఫైడ్, రేషన్‌కార్డు నాట్ వెరిఫైడ్ అని రిమార్కు వస్తోంది. మరికొందరికి ఆధార్ కార్డు రద్దయినట్లు రిమార్కులు వచ్చాయి.

 

 వయసు, స్త్రీ, పురుషుడు, ఇంటిపేర్లు, పేర్లలో తేడాలు, పేర్ల వద్ద ఆధార్‌కార్డు రద్దయిందని రిమార్కులు వచ్చాయి. ఇంటిపేరులో అక్షరం, పొల్లు తేడా ఉన్నా ఆరైతు పేరు వెనక్కు వచ్చేసింది. అలాగే కొందరు రైతులకు సంబంధించి ఆధార్, రేషన్, పట్టాదారు పాస్‌పుస్తకాల్లోని పేర్లలో అక్షర దోషాలు ఉండటంతో రుణమాఫీ జాబితాకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ కంప్యూటర్ అప్‌లోడ్ చేసుకోకుండా రిమార్కులు రాసి పంపారని అధికారులు పేర్కొన్నారు. అర్హుల జాబితా, అనర్హుల జాబితా, జాబితాలో పేర్లు రాని వారు చేసుకున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు జన్మభూమి కమిటీలను, మండల, రెవెన్యూ, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి వడపోత పట్టారు. రుణం మాఫీ అవుతుందని ఎదురుచూసిన రైతులకు అసలు, వడ్డీ అదనపు భారంగా మారింది. తమను వంచించిందని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

 

 రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారానికి చివరి గడువు 7

 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు  ఫిబ్రవరి 7వ తేదీవరకు గడువును పొడగించినట్లు లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరావు శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రెండో జాబితాలో వచ్చిన ఫిర్యాదులను మూడో తేదీలోపు పరిష్కరించి ఆయా మండల అధికారులకు అందజేయాలని పేర్కొ న్నారు. మండల అధికారులు పరిష్కరించిన అర్జీలను ఆయా బ్యాంకులకు 7వ తేదీలోపు అప్‌లోడ్ చేసేందుకు గడువు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలో పెళ్లకూరు, టీపీగూడూరు, నాయుడుపేట, నెల్లూరు, వీకెపాడు, కలిగిరి, అల్లూరు మండలాల్లో వచ్చిన ఫిర్యాదులు అధికసంఖ్యలో తిరస్కరణకు గురైనట్లు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top