కుక్క ఉన్నది జాగ్రత్త

కుక్క ఉన్నది జాగ్రత్త - Sakshi


* ఏపీ, తెలంగాణలో పెరిగిపోతున్న కుక్క కాట్లు

* అందుబాటులో లేని యాంటీరేబిస్ వ్యాక్సిన్

* పాము కాటు బాధితులు ఎనిమిది వేలు

* ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి

* విజయవాడ పెద్దాసుపత్రిలోనూ చికిత్స కరువు

* మంత్రి సమక్షంలో వెల్లడైన చేదు నిజం



సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల వీరంగంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వణికిపోతున్నారు. కుక్కకాట్లలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వీటి కాటుకు గురయ్యే వారు, మరణాల సంఖ్య ఇరు రాష్ట్రాల్లోనూ ఏడాదికేడాది పెరుగుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బైకులపై, సైకిళ్లపై వెళ్లే వారితోపాటు పాదచారులనూ వదలడంలేదు. పిల్లలపై దాడులు మరింత అధికమయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటుకు వైద్యం అందడం లేదు. యాంటీరేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేక అనేక మంది మృత్యువాతపడుతున్నారు.



ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పెద్దాసుపత్రిలోనే చికిత్స లభించకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ పాముకాట్లు విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామాల్లో రాత్రివేళ వీధిలైట్లు వెలగకపోవడం, చీకట్లో రైతులు పంటలకు వెళ్లాల్సిరావడం, మరుగుదొడ్లు లేక రాత్రివేళ ఆరుబయటకు వెళ్లడంవల్ల అనేకమంది పాముకాట్లకు గురై చనిపోతున్నారు.



11 నెలల్లో కుక్కకాట్లు 1.63 లక్షలు... పాముకాట్లు 8,215

తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 11 నెలల కాలంలో 1,63,726 కుక్కకాటు బాధిత కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య అంతకుముందు సంవత్సరాల కంటే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువగా 32,793 కేసులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 24,177 కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ నెలల్లో పాముకాట్ల కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 8,215 నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 1,899 పాముకాట్లు సంభవించగా, మెదక్ జిల్లాలో 1,325 కేసులు నమోదై రెండోస్థానంలో నిలిచింది. మరణాలను రికార్డు చేయడంలో ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. 



జిల్లా కేంద్రాల వరకే కుక్క, పాముకాటు మందులను తక్కువమోతాదులో సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆసుపత్రుల్లో మందులు లేక ఈ కాట్లకు గురైన వారు సరైన చికిత్స అందక మరణిస్తున్నారు. అయితే, కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవడం వల్ల వాటిసంఖ్య అనూహ్యంగా పెరిగిందని, దీనికి స్థానిక సంస్థలే  కారణమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంటోంది.



ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి....

రాష్ర్టంలో కుక్క, పాము కాటుకు గురైన బాధితుల పరిస్థితి ఘోరంగా ఉంది. గత రెండేళ్లలో 500 మందికి పైగా పాముకాటుతో మృతి చెందారు. ఏటా 15 లక్షల మంది కుక్క కాటు బారినపడుతున్నట్లు అంచనా. పెద్దాసుపత్రుల్లోనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. విజయవాడ పెద్దాసుపత్రిలోనే కుక్క కాటు బాధితులకు యాంటీరేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేక గుంటూరు ఆసుపత్రికి వెళ్లమని చెబుతున్నారు.



కుక్క కాటుకు గురైన ఓ బాలుడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యాంటి రేబిస్ టీకా లేకపోవటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించటాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆదివారం స్వయంగా చూశారు. ఇక్కడే ఇలా ఉంటే ఇక జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.



కుక్కకాట్లు పెరిగాయి

తెలంగాణలో గతంలో కంటే కుక్కకాట్లు పెరిగిన మాట వాస్తవమే. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలదే. గతంలో కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేసేవారు. ఇప్పుడా అవసరం లేదు. సాధారణ ఇంజక్షన్ల మాదిరిగా వేయించుకొని రావచ్చు. ప్రభుత్వం వాటిని ఉచితంగా సరఫరా చేస్తుంది.

- డాక్టర్ సాంబశివరావు, డెరైక్టర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ



మందులకు కొరత లేదు

‘ఏపీలో ఏఆర్‌వీ, ఏఎస్‌వీ మందులకు కొరత లేదు. 1.29 లక్షల వయెల్స్ ఏఆర్‌వీ సిద్ధంగా ఉంది. పాముకాటు మందు కూడా అందుబాటులో ఉంది. కుక్కలు ముఖానికి దగ్గరగా కరచినప్పుడు ఏఆర్‌వీతో పాటు రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. అది మాత్రమే అందుబాటులో లేదు’

- ఎం.రవిచంద్ర (ఏపీ మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ  ఎండీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top