మలుపు తిరిగిన ఫాదర్ ఆంథోని మృతి కేసు


 చింతలపూడి :చింతలపూడికి చెందిన ఫాదర్ ఆంథోని అనుమానాస్పద మృతి కేసు బుధవారం కొత్త మలుపు తిరిగింది. మంగళవారం అనారోగ్యానికి గురైన ఆయనను హుటాహుటిన ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కాగా, ఆంథోని మృతిపై చింతలపూడిలోని ఆంథోని నగర్ ప్రజలు, తోటి ఫాదర్లు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆంథోని నిర్వహిస్తున్న ప్రార్థనా మందిరంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫాదర్ ఆంథోని అందులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై డి.రాంబాబు చెప్పారు. అంథోని మృతదేహాన్ని ఆశ్రం ఆసుపత్రి నుండి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందం సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించినట్టు చెప్పారు.

 

 కన్నీటి పర్యంతం

 ఆంథోని మృతితో ఆంథోని నగర్ మూగబోయింది. గ్రామంలోని ప్రజలు, ఆయన అభిమానులు ఆంథోని ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 30 ఏళ్లుగా ఆంథోని పేద ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తన పేరిట ఆంథోని నగర్ గ్రామాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టించారు. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ఆదుకునేవారని గ్రామస్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఆంథోని మృతదేహాన్ని అంబులెన్స్‌లో చింతలపూడి ఆంథోని చర్చికి తీసుకువచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున ఆంథోని నగర్ చేరుకున్నారు. ప్రజల సందర్శనార్థం ఆంథోని పార్ధివ దేహాన్ని చర్చి ఆవరణలో ఉంచారు. ముందుజాగ్రత్త చర్యగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో సీఐ జి.దాసు ఆంథోని నగర్ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజల సందర్శన అనంతరం చర్చి ఆవరణలోనే ఆంథోని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.

 

 మృతదేహంతో ఆందోళన

 పోస్టుమార్టం అనంతరం ఆంథోని మృతదేహంతో ఆయన అభిమానులు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో కొద్దిసేపు ధర్నా నిర్వహిం చారు. అనంతరం ర్యాలీగా శాంతినగర్‌లోని బిషప్ హౌస్‌కు చేరుకుని అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. లోనికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిషప్ పొలిమేర జయరావు ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంథోని ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి తగిన న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా సీఐలు యు.బంగార్రాజు, రాజశేఖర్, ఎస్సైలు ఎం.సాగర్‌బాబు, ప్రసాద్‌కుమార్ బందోబస్తు నిర్వహించారు.

 

 ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

 ఏలూరు అర్బన్ : ఫాదర్ ఆంథోని ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మృతుని బంధువులు, అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అంథోని ఆత్మహ త్య చేసుకునే విధంగా వేధింపులకు గురిచేసిన వారిపై హత్యకేసు నమోదు చేయాలని, ఆయన మృతిపై న్యాయ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. చింతలపూడి ఎస్సై డి.రాంబాబు వారితో మాట్లాడారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని, మృతదేమాన్ని పోస్టుమార్టం జరిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top