ఎస్సీ వర్గీకరణకు మరో ఉద్యమం


మార్కాపురం: ఏబీసీడీ వర్గీకరణ కోసం మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గురువారం రాత్రి నిర్వహించిన మార్కాపురం డివిజన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశానికి వీ జాని అధ్యక్షత వహించగా..ముఖ్య అతిథిగా కృష్ణమాదిగ పాల్గొన్నారు.



 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తాము గెలిస్తే ఏబీసీడీ వర్గీకరణ కోసం కృషి చేస్తామని హామీలు ఇచ్చిన తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రాలో టీడీపీ, కేంద్రంలో బీజేపీలకు తాము ఆర్నెల్ల గడువు ఇచ్చామని.. వచ్చే నెల 8వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. అప్పట్లోపు రెండు రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబరు 14, 15 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగే ఎమ్మార్పీస్ రాష్ట్ర సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఉద్యమాన్ని చేపడతామని కృష్ణ మాదిగ ప్రకటించారు. తనపై కొందరు ఉద్యమ సోదరులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.



తన జీవిత లక్ష్యం ఏబీసీడీ వర్గీకరణే అన్నారు. అతిథులుగా హాజరైన యర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు డేవిడ్‌రాజు, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కృష్ణ మాదిగ చేపట్టబోయే ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ఉద్యమాలు చీల్చేందుకు పలువురు కుట్రలు పన్నుతున్నారని వారు విమర్శించారు.



మాదిగల ఆత్మ గౌరవానికి గుర్తింపు తెచ్చిన ఘనత కృష్ణ మాదిగకే దక్కుతుందని చెప్పారు. గతంలో వర్గీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని వారు గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు ఉసురుపాటి బ్రహ్మయ్య, పందిటి కాశీరావు, బలుసుపాటి గాలెయ్య, షాలెం, నర్శింహ, నగేశ్, విజయకుమార్, ఫ్రాంక్లీన్, దోర్నాల, పుల్లలచెరువు ఎంపీపీలు ప్రభాకర్, సుందరరావు, బీజేపీ నేత కృష్ణారావు పాల్గొని మాట్లాడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top