ఇదేనా ప్రక్షాళన?

ఇదేనా ప్రక్షాళన? - Sakshi


- ఏఎన్‌యూలో మరో వేధింపుల ఘటన

- సీసీ కెమెరాలు, ర్యాగింగ్ బోర్డులతో ఫలితం శూన్యం

- రిషితేశ్వరి మృతి కళ్లముందు కదలాడుతుండగానే మరో ర్యాగింగ్ కలకలం

ఏఎన్‌యూ:
‘ఏఎన్‌యూను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.. మరోమారు ఇటువంటి ఘటనలు జరగనివ్వబోం.. రిషితేశ్వరి మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..’ అంటూ అధికారులు, పాలకులు చెప్పిన మాటలు ఆచరణలో అమలు కాలేదు. రిషితేశ్వరి ఘటన మరువకముందే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మరో వేధింపుల పర్వం చోటుచేసుకుంది.



వర్సిటీ సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ బోటనీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎస్.రత్నమంజరి తనను ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి బాలయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని చేసిన ఫిర్యాదు ఏఎన్‌యూలో కలకలం రేపింది. దీంతో ఏఎన్‌యూ, పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. బాలయ్యను రెండువారాలు సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ గురువారం ఉదయం ప్రకటించగా, సుధీర్ఘ విచారణ అనంతరం బాలయ్యను పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

కంటితుడుపు సంస్కరణలు..  ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనతో నెలరోజులపాటు ఏఎన్‌యూలో నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని, ఏఎన్‌యూ ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ కమిటీలు నానా హడావుడి చేసి పలువురిని విచారించి నివేదికలు సమర్పించాయి. కానీ ఈ నివేదికలు బహిర్గతం కాలేదు. దీంతోపాటు ఏఎన్‌యూలో ప్రక్షాళన పేరుతో అధికారులు అనేక చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ ప్రధానద్వారం వద్ద పోలీసు ఔట్‌పోస్ట్, అన్ని ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గుర్తింపుకార్డులు ఉన్న వారికే ఏఎన్‌యూలోకి ప్రవేశమనే నిబంధన విధించారు.



ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీలో పోస్టర్లు, కరపత్రాలు ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేశారు. ఏఎన్‌యూలో పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరులో ఒక ఫిర్యాదు, పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో గతంలో నమోదయ్యాయి . ఏఎన్‌యూలో మరలా ఇలాంటి ఘటన జరగనివ్వమని, రిషితేశ్వరి ఘటనకు కారణమైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. కానీ అధికారుల ప్రకటనలు, ఏఎన్‌యూలో చేపట్టిన కంటితుడుపు సంస్కరణలు  ఫలితానివ్వలేదు.

 

శాశ్వత పరిష్కారం ఏదీ..? వరుసగా చోటుచేసుకుంటున్న ర్యాగింగ్, వేధింపుల ఘటనలతో ఏఎన్‌యూ ప్రక్షాళన సవాలుగా మారింది. నవ్యాంధ్ర రాజధానిలో ఉన్న ఏఎన్‌యూని దేశంలో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ఏఎన్‌యూ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడితేనే పూర్తిస్థాయి ఫలితం ఉంటుందనే విషయం గురువారం చోటుచేసుకున్న ఘటనలతో తేటతెల్లమయింది. పబ్లిసిటీ, కంటితుడుపు చర్యలను పక్కనపెట్టి వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top