వణికించిన వర్షం

విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో కల్వర్టు తెగటంతో 30 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు - Sakshi

మరో 24 గంటలు భారీ వర్షాలు..

 

- వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుంభవృష్టి 

వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు 

స్తంభించిన జనజీవనం.. నిలిచిపోయిన రాకపోకలు 

రహదారులపైకి భారీగా చేరిన వరద నీరు 

విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం 

సముద్రంలో ఐదుగురు మత్స్యకారులు గల్లంతు 

నేడు తీరాన్ని దాటనున్న వాయుగుండం

 

సాక్షి నెట్‌వర్క్‌: వాయువ్య బంగాళాఖాతంలో కొనసా గుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహ దారులపైకి భారీగా నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఏజెన్సీ, లంక ప్రాంతాల్లోని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 69 ఫీడర్లలో మంగళవారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.



ఫలితంగా 2 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి చేరుకుంది. ఇది మంగళవారం రాత్రికి ఒడిశాలోని గోపాల్‌పూర్‌– పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. కోస్తాంధ్రలో వచ్చే 24 గంటల్లో భారీవర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 48 గంటల్లో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, రాయల సీమలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వివరించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

 

అల్లకల్లోలంగా సముద్రం 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారిం ది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరంలో ఈదురుగాలులు ప్రభావం అధికంగా ఉంది. చలి తీవ్రత పెరగడంతో తీరప్రాంత వాసులు వణికిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 1,731.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విలీన మండలమైన చింతూరులో అత్యధికంగా 82.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా యు.కొత్తపల్లిలో 6.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. పలు మండలాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. కొత్తపల్లి మండలం ఉప్పాడ, సుబ్బంపేట తదితర గ్రామాల్లో ఎండుచేపల కళ్లాలు నీట పాలయ్యాయి. చింతూరు మండలంలో షోకులేరు వాగు పొంగడంతో చింతూరు–వీఆర్‌ పురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. సీలేరు నది పొంగి ప్రవహిస్తుండడంతో శబరి నదికి వరదనీరు భారీగా చేరుతోంది. గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. 

 

ఐదుగురు మత్స్యకారులు గల్లంతు 

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు రంగంపేటకు చెందిన ఐదుగురు మత్స్యకారులు ఆచూకీ లేకుండా పోయారు. వేటకు వెళ్లి పది రోజులైనా వారు ఇంటికి రాకపోగా ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

 

కృష్ణా జిల్లాలో భారీ వర్షం 

కృష్ణా జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 51.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలోని మున్నేరు, వైరా, కట్టలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీవర్షం కురవడంతో విజయవాడ, మచిలీపట్నంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. జనజీవనం కొంతమేర స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏజెన్సీ మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు తదితర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పంటపొలాలు నీట మునిగాయి. దీంతో నారుమళ్లు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో జనజీవనం స్తంభించింది. తూళ్లురులో అత్యధికంగా 65.4 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 32.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. కొండవీటి వాగుకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది.  

 

ఈదురు గాలులతో కూడిన వర్షాలు 

నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. నెల్లూరు రూరల్‌ మండలం కొత్తూరు, ఆమంచర్ల తదితర ప్రాంతాలతోపాటు నగరంలో పెద్ద ఎత్తున గాలులు వీచాయి. పొదలకూరు మండలంలో వీచిన గాలులకు చెట్లు నేల కూలాయి. జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో ఉధృతంగా వర్షాలు కురుస్తున్నాయి. మన్యంలో తీవ్రత ఎక్కువగా ఉంది. డొంకరాయి జలాశయం, డుడుమ జలాశయంలో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుతుండడంతో గేట్లు ఎత్తి నీరు కిందికి విడుదల చేశారు. వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపతోపాటు చుట్టుపక్కల మండలాల్లో జల్లులు కురిశాయి. 

 

వర్షంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం 

వర్షాల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 30 గ్రామాల్లో మంగళవారం రోజంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో విద్యుత్‌ సరఫరాకు ఎక్కువగా నష్టం జరిగింది. కొన్నిచోట్ల స్తంభాలు వంగిపోయాయి. మరికొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నీరు చేరడంతో విద్యుత్‌ను ఆపివేశారు. మారుమూల గ్రామాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇదిలా ఉంటే విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పడిపోయింది. మూడు రోజుల క్రితం రాష్ట్రంలో రోజుకు 145 మిలియన్‌ యూనిట్లు ఉంటే, మంగళవారం డిమాండ్‌ 136 మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది. ఫలితంగా ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. 

 

నేడు భారీ వర్షాలు 

వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావం వల్ల ఏర్పడిన వాయుగుండం మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి చేరుకుంది. పశ్చిమ వాయవ్య మార్గంలో పయనిస్తున్న ఇది మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజామున ఒడిశాలోని గోపాల్‌పూర్‌–పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ధ్రోణి ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా పయనిస్తోందని తెలిపింది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో వచ్చే 24 గంటల్లో భారీవర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 48 గంటల్లో కోస్తా జిల్లాల్లో తేలిపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాయలసీమలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వివరించింది.



వాయుగుండం వల్ల కోస్తాంధ్రలో నైరుతీ రుతుపవనాలు తీవ్ర బలోపేతమయ్యాయని ఐఎండీ పేర్కొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజుల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ వైకే రెడ్డి తెలిపారు. వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వేగం ఒక దశలో 60 కిలోమీటర్లకు కూడా చేరే అవకాశం ఉందని వివరించారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

 

గోదావరి పరవళ్లు... వంశధార ఉరవళ్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతుండగా, వంశధార, నాగావళి నదులు ఉరకలు వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం ఒక్కరోజే 1,67,831 క్యూసెక్కుల(14.50 టీఎంసీలు) గోదావరి జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ 70.31 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి. ఈ ఏడాది ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మూడు రోజులుగా తెలంగాణ, ఏపీ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఓ మోసర్తు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరులు ఉప్పొంగుతుండడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది.



మంగళవారం ధవళేశ్వరం బ్యారేజీకి 1,70,931 క్యూసెక్కుల నీరు రాగా, 3,100 క్యూసెక్కులను గోదావరి డెల్టాకు విడుదల చేసి మిగతా నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంగళవారం గొట్టా బ్యారేజీకి 29,518 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. బుధవారం కూడా వంశధారకు భారీ ఎత్తున వరద వచ్చే అవకాశం ఉండటంతో గొట్టా బ్యారేజీ నుంచి 30,740 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంపై వరుణుడు శీతకన్నేశాడు. కృష్ణా నది జలకళ తప్పింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నీళ్లు లేక బోసిపోతున్నాయి.   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top