జెడ్పీ వార్షిక బడ్జెట్ రూ.260కోట్లు


కర్నూలు(జిల్లా పరిషత్ ): కర్నూలు జిల్లా ప్రజాపరిషత్ 2015-16 సంవత్సరానికి గాను రూ.260కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌ను శనివారం స్థాయీ సంఘాల కమిటీల ముందు ప్రవేశపెట్టారు. కమిటీలు ఈ బడ్జెట్‌ను ఆమోదించి, ఈ నెల 27వ తేదీన జరిగే జెడ్పీ జనరల్ బాడీ సమావేశం ముందుంచేందుకు తీర్మానించాయి. జనరల్ బాడీ ఆమోదించిన తర్వాత దానిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఈ బడ్జెట్‌ను వచ్చే యేడాది ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 199ని అనుసరించి, ప్రభుత్వ ఉత్తర్వుల నెం.172 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి నిబంధనల మేరకు జిల్లా పరిషత్ 2014-15 సంవత్సరపు సవరణ బడ్జెట్, 2015-16వ సంవత్సరపు బడ్జెట్ అంచనాలను అధికారులు తయారు చేశారు. జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల ఆవశ్యకత, గత సంవత్సరపు జిల్లా పరిషత్ వార్షిక లెక్కల్లో ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారు.

 

  2013-14, 2014-15నకు సంబంధించి ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని 2014-15 సవరణ బడ్జెట్, 2015-16 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను శనివారం జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో ఏవో భాస్కరనాయుడు ప్రవేశపెట్టారు. అధికారుల లెక్కల ప్రకారం 2013-14లో ఆదాయం రూ.127.08 కోట్లు, వ్యయం రూ.117.31కోట్లు, 2014-15 సంవత్సరంలో రూ.276.62కోట్లు, వ్యయం రూ.276.50 కోట్లు, సవరించిన బడ్జెట్ 2014-15లో ఆదాయం రూ.196.47కోట్లు, వ్యయం రూ.196.46కోట్లు, 2015-16 సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూ.260.01కోట్లు, వ్యయం రూ.259.72 కోట్లుగా అధికారులు చూపించారు.

 

 అవి మొక్కుబడి సమావేశాలు

 -అధికారుల ప్రగతి నివేదికలతో సరి

 కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లా ప్రజా పరిషత్ జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు మొక్కుబడిగా సాగాయి. ఏడు కమిటీల్లోనూ సభ్యులు నామమాత్రంగా హాజరయ్యారు. దీంతో అధికారుల ప్రగతి నివేదికలతో సమావేశాలను మమ అనిపించారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన స్థాయీ సంఘ సమావేశాలు గంట ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మొదట 5వ స్థాయీ సంఘమైన స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో ప్రారంభించగా అంగన్‌వాడీ కేంద్రాలను సభ్యులు తరచూ తనిఖీ చేయాలని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ సూచించారు.

 

 ఎన్‌సీఎల్‌పీ పీడీ సమావేశానికి హాజరుకాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 6వ స్థాయీ సంఘమైన సాంఘిక సంక్షేమం, 3వ స్థాయీ సంఘమైన వ్యవసాయ శాఖ సమావేశంలో అధికారులు ప్రగతిని నివేదించారు. ప్రతి మండలంలో 3 గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజి నిర్మాణాలకు రూ.250కోట్లు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ ఎస్‌ఈ సురేంద్రబాబు చెప్పారు. ఆదర్శగ్రామంగా ఎన్నికైన నాగులదిన్నెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top