వరదకాలువలో పడి నర్సు మృతి

వరదకాలువలో పడి నర్సు మృతి - Sakshi


డక్కిలి (నెల్లూరు జిల్లా) : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న పైడిపాటి వెంకట రాజ్యలక్ష్మి (35) డక్కిలి-కమ్మపల్లి మార్గంలోని వాగులో పడి సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే ఆమె మృతి విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు కథనం మేరకు.. సోమవారం ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్కూటీ మీద ఇంటికి వెళ్తుండగా కమ్మపల్లి సమీపంలోని మలుపు వద్ద వాగు వరద ప్రవాహం రోడ్డుపై ప్రవహిస్తుంది.



అదే సమయంలో ఇంటికి వెళ్తున్న రాజ్యలక్ష్మి రోడ్డుమార్గం సక్రమంగా కనపడకపోవడంతో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల పైకి లేవలేకపోవడంతో వాగులోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెంది ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వస్తానని బంధువులకు వెంకట రాజ్యలక్ష్మి  ఫోన్‌లో తెలియజేసింది. 7 గంటలకు విధులు ముగించుకుని బయలుదేరిన ఆమెను మార్గమధ్యంలోని వాగు మృత్యువు రూపంలో కబళించింది.



సంఘటనాస్థలంలో మిన్నంటిన రోదనలు..



ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న వెంకటరాజ్యలక్ష్మి ఆసుపత్రికి వచ్చే రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వైద్య సేవలు అందించేది. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తున్న ఆమె పట్ల సహ ఉద్యోగులకు కూడా మంచి అభిప్రాయం ఉంది. వెంకట రాజ్యలక్ష్మి రేషన్‌షాపు డీలర్‌గా కూడా పని చేస్తుంది. పేద ప్రజలకు రేషన్ సరుకులు నిజాయితీగా అందిస్తు వారి మన్ననులు కూడా పొందుతుండేది.



వాగులో పడి ఆమె అకాల మరణం చెందడంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు, బంధువులు సంఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతిచెందిన తీరుని తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెతో కలిసి పనిచేసే స్థానిక వైద్య సిబ్బంది బోరున విలపించారు. నీళ్లల్లో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి శవపరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



మృతదేహాన్ని పరిశీలించిన ఆధికారులు..



వరదకాలువలో పడి మృతి చెందిన ఏఎన్‌ఎం వెంకటరాజ్యలక్ష్మి మృతదేహాన్ని తహశీల్దార్ రాజ్‌కుమార్, వెంకటగిరి సీఐ ఎం శ్రీనివాసరావు, వైద్యాధికారి సుధీర్‌బాబు తదితరులు పరిశీలించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అక్కడ నుండి తహశీల్దార్ రాజ్‌కుమార్, గూడూరు సబ్‌కలెక్టర్ గిరిషాకి కూడా ఫోన్ ద్వారా తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top