‘అంగుల్-పలాస’ ఆర్నెళ్లలో అసాధ్యమే!


  • ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం తప్పని నిరీక్షణ

  • సాక్షి, హైదరాబాద్: ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండులైన్లు నిర్మిస్తోంది. 4500 మెగావాట్ల విద్యుత్ ప్రసారం చేసే సామర్థ్యంతో అంగుల్-పలాస, వార్ధా-డిచ్‌పల్లి లైన్లు నిర్మాణంలో ఉన్నాయి. అంగుల్-పలాస లైన్ ఐదారు నెలల్లో పూర్తవుతుంది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇక డిచ్‌పల్లి లైను మరో 18 నెలలు పడుతుంది.’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవలఅసెంబ్లీలో ప్రకటించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి తెలంగాణకు విద్యుత్ రావడానికి ఆ లైన్ వేగంగా పూర్తవుతుందా..? అని పరిశీలిస్తే,  పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చేపట్టిన లైన్ల నిర్మాణం మరో ఏడాదిన్నరలోపు పూర్తయ్యేలా లేదని తేలింది. ఒడిశాలో ఉన్న అంగుల్ నుంచి పలాసకు దాదాపు 370 కిలోమీటర్లు. రెండేళ్ల కిందటే పవర్‌గ్రిడ్ శ్రీకాకుళం ప్యాకేజీ పేరిట ఈ పనులకు టెండర్లు పిలిచింది. వచ్చే ఏడాది జూలై నాటికి దీనిని పూర్తి చేయాల్సి ఉంది. కానీ వేగంగా జరగడం లేదని ఏప్రిల్‌లో జరిగిన జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్‌లో చర్చ జరిగింది.

     

    వేమగిరి ప్యాకేజీదీ అదే పరిస్థితి...



    అక్కడి నుంచి  రాజమండ్రి మీదుగా ఖమ్మం, హైదరాబాద్ వరకు మరో 780 కిలోమీటర్లు లైన్ల నిర్మాణం మొదలైంది. వేమగిరి ప్యాకేజీ పేరిట ఉన్న ఈ లైన్ల నిర్మాణం ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి. అయితే ఇవి కూడా గడువులోగా పూర్తయ్యేలా లేవు. అభ్యంతరాలు, సామర్థ్యం పెంపు అంశాలు  సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులటరీ కమిషన్ పరిధిలో ఆలస్యం కావడంతో పనులు ఆగిన ట్టు తెలుస్తోంది. అనుమతులన్నీ లభించి ఈ రెండు కారిడార్‌లు వేగంగా పూర్తయినా, వచ్చే ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

     

    మహేశ్వరం లైన్‌కు రెండున్నరేళ్లు ....



    ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్ధా, అక్కడినుంచి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మీదుగా మహేశ్వరం వరకు లైన్ల నిర్మాణం పురోగతిలో ఉంది.  ఇప్పటికే వార్ధాదాకా లైన్ పూర్తయింది. అక్కడి నుంచి మహేశ్వరం దాకా 560 కిలోమీటర్ల లైన్ ఇంకా టెండర్ల దశలోనే ఉంది. వెంటనే పనులు ప్రారంభించినా,  నిర్మాణం పూర్తయ్యే సరికి కనీసం రెండున్నరేళ్లు పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. అప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అవకాశం లేనట్టే. రాయచూర్-షోలాపూర్ లైన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయినప్పటికీ కారిడార్‌ను బుక్ చేసుకోవడంలో ఉమ్మడిప్రభుత్వం విఫలమైంది. గతంలో ఉత్తరాది రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకపోవడ ఇప్పుడు శాపంగా పరిణమించింది. తమిళనాడు ప్రభుత్వం రెండేళ్ల కిందటే 4500 మెగావాట్లకు కారిడార్‌ను రిజర్వు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకున్న వెంటనే కారిడార్‌ను రిజర్వు చేసుకుంటే కొత్తలైన్లు పూర్తయ్యేదాకా ఎదురుచూపులు తప్పవనే వాదనలున్నాయి. ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఎప్పుడు వస్తుందోనని అధికారులు పెదవి విరుస్తున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top