చింతమనేనిని అరెస్ట్ చేయూలి


రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్

 ఏలూరు (మెట్రో) : అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ శుక్రవారం విరుచుకుపడిన ఘటనను మహిళా, కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. శనివారం జిల్లా ఐద్యా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు జి.విజయలక్ష్మి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐద్యా జిల్లా నాయకురాలు జి.విమల మాట్లాడుతూ చింతమనేని జీవితం రౌడీయిజంతో ముడిపడి ఉందన్నారు. తల్లిదండ్రులను కష్టపెట్టటం, కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవటం వంటివి ఆయన జీవిత చరిత్రలో ఓ భాగమని చెప్పారు. ఉపయోగించుకుని వదిలిపెట్టేసే వ్యక్తి చింతమనేని అని పేర్కొన్నారు.

 

  అటువంటి వ్యక్తిని చట్టసభలోకి ఎందుకు పంపించారో అర్ధం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గంపల బ్రహ్మావతి మాట్లాడుతూ ఇటువంటి వారి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఎం జిల్లా అధ్యక్షులు బి.బలరామ్ మాట్లాడుతూ చింతమనేనికి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. టీడీపీకి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే అతనిని అరెస్ట్ చేయాలన్నారు. రౌడీషీటర్, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పార్టీ పదవులు కట్టబెట్టడం తగదన్నారు. తక్షణమే అంగన్‌వాడీలకు క్షమాపణ చెప్పాలన్నారు. మున్నుల జాన్‌గుర్నాథ్ మాట్లాడుతూ రౌడీలతో, గూండాలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారనడానికి చింతమనేని తీరే నిదర్శనమన్నారు. ఐద్వా జిల్లా  అధ్యక్షులు సిహెచ్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారిత గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి వెంటనే చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top